దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఇళ్ల విక్రయం కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది కేంద్రం. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి (నరేడ్కో) https://www.housingforall.com/ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.
రెరా కింద నమోదైన నమ్మకమైన, భద్రమైన, నాణ్యమైన ఇళ్లను మాత్రమే ఈ వెబ్‌సైట్ ద్వారా విక్రయించనున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రకటించారు. పూర్తిగా సిద్ధమైన ఇళ్లను వర్చువల్ రియాల్టీ ద్వారా పరీక్షించుకుని ఎంపికచేసుకోవచ్చని చెప్పారు.
మార్చి 1 నుంచి విక్రయాలు
ఇందులో దాదాపు వెయ్యి ప్రాజెక్టులను లిస్ట్ చేయనున్నట్లు నరేడ్కో ప్రకటించింది. ఈ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవడానికి స్థిరాస్తి వ్యాపారులకు ఫిబ్రవరి 13 వరకు గడువు ఉంటుంది. ఫిబ్రవరి 14 నుంచి వినియోగదారులకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. మార్చి 1 నుంచి విక్రయాలు మొదలవుతాయి.