శాసనసభ, సచివాలయం నూతన భవన నిర్మాణాలకు సంబంధించిన కేసును హైకోర్టు జులై 8కి వాయిదా వేసింది. ఎర్రమంజిల్లో నూతన అసెంబ్లీ భవన నిర్మాణానికి సంబంధించిన నమూనా, పార్కింగ్, ఇతర సౌకర్యాలపై పూర్తి వివరాలతో నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త శాసనసభ భవనాన్ని నిర్మించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని సవాల్ చేస్తూ.. రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటి తరఫున న్యాయవాదులు తమ వాదన వినిపించారు. చారిత్రక నేపథ్యం ఉన్న భవనాన్ని కూల్చివేసి... కొత్త భవనాలను నిర్మించడం ప్రజాధనం వృథా చేయడమేనని వాదించారు.
సమస్యలు ఉత్పన్నం అవుతాయి..
ఉమ్మడి శాసనసభలో 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా.. ప్రస్తుత భవనం సౌకర్యవంతంగా ఉండేదని.... ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సభ్యుల సంఖ్య సగానికి కన్నా తక్కువగా ఉందని.... సౌకర్యాల పేరిట నూతన భవనం నిర్మించాల్సిన అవసరం ఏముందని న్యాయవాదులు ప్రశ్నించారు. ఎర్రమంజిల్లోకి అసెంబ్లీని మార్చడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమై... వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.
జులై 8కి వాయిదా...
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించి అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు.... చారిత్రక కట్టడాల జాబితాలో ఎర్రమంజిల్ భవనం లేదని హైకోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనాలు విన్న హైకోర్టు.... సమర్థత, అభ్యంతరాలకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ఇరుపక్షాలను ఆదేశించింది.
సచివాలయ పునర్నిర్మాణాకి సంబంధించి జీవన్ రెడ్డి, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్, మరో పిటిషనర్ 2016 సంవత్సరంలో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఆగస్ట్ చివరి వారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసినందున ఇప్పుడు వినలేమని తెలిపింది. సచివాలయ నిర్మాణం విషయంలో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను మాత్రం జులై 8కి శాసనసభ నూతన భవన నిర్మాణ కేసుతో పాటు వింటామని తెలిపింది.
ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాలు పచ్చగా కళకళలాడాలి