వర్షాకాలంలో పురపాలక సంఘాల పరిధిలోని శిథిల భవనాలు కూలి ప్రమాదాలు జరిగితే ఛైర్మన్లు, కమిషనర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వెంటనే కూల్చి వేయాలని కేటీఆర్ తెలిపారు. నల్గొండ జిల్లా పరిధిలోని పురపాలక సంఘాలపై మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు.
ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పురపాలన కొనసాగించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. పట్టణాల్లో రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస అవసరాలపై ప్రధాన దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. నూతన పురపాలక చట్టం నిర్దేశించిన విధులను తప్పకుండా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత పురపాలక సంఘాలకు గతంలో ఎన్నడూ లేనంతగా... పెద్ద ఎత్తున నిధులు అందుతున్నాయన్నారు. నిధులు సద్వినియోగం చేసుకొని పట్టణాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని కేటీఆర్ సూచించారు. నల్గొండ, మిర్యాలగూడల్లో ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యేందుకు సహకరిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అవసరాల మేరకు స్వచ్ఛ వాహనాలను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. టాయిలెట్లు, బస్ బేల నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. ఈనెల 29న నల్గొండ జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.