ఏ లోటు లేకుండా పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలనేది తల్లిదండ్రుల ఆలోచన. మంచి చదువు చెప్పిస్తారు. నచ్చిన బట్టలు కొనిస్తారు. అన్ని విషయాల్ని దగ్గరుండి చూస్తారు. కానీ లైంగిక జ్ఞానాన్ని అందివ్వడానికి వెనకాడతారు. ఈ విషయంలో వారికి కనీస అవగాహన కల్పించకపోవడం రేపటి సమాజాన్ని కలవరపెడుతోంది.
ఏటాలక్షల మంది ఆడపిల్లలు పురిటిలోనే కన్ను మూస్తున్నారు. అయినా మనం మహిళా దినోత్సవాలు జరుపుకుంటాం. ఆడపిల్లల్ని రక్షించండి. సమజాన్ని కాపాడండి అని నినాదాలు చేసుకుంటాం. వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకుని తర్వాత రోజు ఆ విషయాన్ని మర్చిపోతున్నాం.
యుక్త వయసులో లైంగిక పరిజ్ఞానం లేక ఎందరో అమ్మాయిలు.... నయవంచకుల చేతుల్లో మోసపోయి గర్భం దాల్చుతున్నారు. చెత్తకుప్పలపై, నిర్మానుష్య ప్రదేశాల్లోనూ ఆ పిల్లల్ని విడిచిపెట్టి పోతున్నారు. దీనికి కారణం తల్లిదండ్రులతోవారికి అంతగా మాట్లాడే చనువు లేకపోవడం. సెక్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియకపోవడం.
టీనేజ్ పిల్లలకి తల్లితండ్రులు చెప్పాల్సిన విషయాలు...
- పరిచయస్తులు, బంధువులఒడిలో కూర్చోవద్దని పిల్లల్ని హెచ్చరించండి.
- పిల్లల ఎదుట బట్టలు మార్చుకోవద్దు.
- ఇతను నిన్ను పెళ్లి చేసుకుంటాడు. నీ భర్త అవుతాడు అని చెప్పి భవిష్యత్తులో జరిగే అనర్ధాలకుకారణం కావొద్దు.
- బయట ఆడుకునేటపుడు పిల్లలు ఏమేం ఆటలు ఆడుతున్నారో గమనించండి.
- ఎవరితోనైనా అసౌకర్యంగా అనిపిస్తోందని చెప్పినపుడు వారితో వెళ్లు, కూర్చో, మాట్లాడు అని బలవంత పెట్టకండి.
- గలగల మాట్లాడే అమ్మాయి ఒక్కసారిగా మౌనం వహిస్తే కారణం అడిగి తెలుసుకోండి.
- సెక్స్ అంటే సరైన అవగాహన కల్పించండి. లేదంటే సమాజం దాని గురించి తప్పు తప్పుగా చెప్తుంది.
- ఏదైనా కార్టూన్ వీడియోలు చూసేముందు ఒకసారి దాని గురించి తెలుసుకోండి. అందులో అశ్లీలత ఏమైనా ఉందేమో పరిశీలించండి.
- సెల్ఫోన్, కంప్యూటర్ లాంటి సాంకేతికత పరికరాలను ఉపయోగించే ముందు అందులో పేరెంట్ కంట్రోల్ మోడ్ ఉండేలా చూసుకోండి.
- మూడు సంవత్సరాల వయసు నుంచే శరీర శుభ్రతపై అవగాహన ఏర్పరచండి. వేరొకరితో చనువుగా ఉండే ముందు ఆలోచించమని చెప్పండి.
- హాని కల్గించే వస్తువులను, మనుష్యులను, కుటుంబీకులను పిల్లల నుంచి దూరంగా ఉంచండి.
- సముహాల మధ్య నిలబడవల్సివస్తే ఎలా జాగ్రత్త పడాలో తెలపండి.
- ఎవరి మీదనైనా మీ పిల్లలు ఫిర్యాదు చేస్తే ఆ విషయాన్ని విస్మరించకండి.
- ఏదైనా సమస్యను ధైర్యంగా ఎదుర్కొనేలా వారికి విలువలు నేర్పండి.
తల్లిదండ్రులుగా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. మీ పిల్లల్ని మీరు బతికున్నంత వరకు కంటికి రెప్పలా చూడాలనుకుంటారు. కానీ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది వారిని జీవితాంతం వెంటాడుతుందనే విషయాన్ని మర్చిపోకండి.