133వ అంతర్జాతీయ మేడే వేడుకలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి. అన్ని ప్రధాన పార్టీల కార్యాలయాల్లోనూ నేతలు జెండా ఆవిష్కరించారు. పలుచోట్ల కార్మికుల ర్యాలీలు నిర్వహించారు. మేడే వేడుకల్లో తెరాస, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, రాజకీయ పార్టీలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఆరెస్పీ తదితర సంఘాల నేతలు పాల్గొన్నారు. శ్రామికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ భవన్లో మేడే వేడుకలు
తెరాస ఆధ్వర్యంలో మేడే వేడుకలు తెలంగాణ భవన్లో జరిగాయి. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జెండా ఆవిష్కరించారు. మేకిన్ ఇండియా, మేకిన్ తెలంగాణలో భాగంగా భారీ స్థాయిలో పరిశ్రమలు వస్తున్నాయని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. నియోజకవర్గాల్లోని ఎమ్యెల్యేలు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.
తెదేపా ఆధ్వర్యంలో..
కార్మిక దినోత్సవ వేడుకలు ఎన్టీఆర్ భవన్లో అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమానికి కృషి చేసిన నేతలను సన్మానించారు. రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని, విపక్షం లేకుండా చేయాలనే మనస్థత్వంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
హాస్తం పార్టీ ఆధ్వర్యంలో...
కాంగ్రెస్ నేతలు కూడా వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సుర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ హాజరై జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగని నాగన్న ఇతర నేతలు, కార్మిక సంఘాల నాయకులు భారీ మొత్తంలో కార్మికులు పాల్గొన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన మేడే వేడుకల్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొని శ్రామిక సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
సీపీఐ ఆధ్వర్యంలో...
సిద్దిపేట జిల్లా హూస్నాబాద్లోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పాల్గొన్నారు. శ్రామిక జెండా ఎగరవేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు.
సీపీఎం కార్యాలయంలో...
హైదరాబాద్ సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జెండాను ఆవిష్కరించారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను యాజమాన్య ధోరణుల నుంచి కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని గుర్తుచేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన కూడళ్లన్నీ కార్మిక జెండాలతో ఎరుపురంగు పులుముకున్నాయి. కార్మికులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల అన్నదానాలు, రక్త దానాలు నిర్వహించారు.
ఇవీ చూడండి: అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస