బీడువారిన భూముల్లో గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి ఈ నెల 21న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సమక్షంలో... ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, ఫడణవీస్ ముఖ్య అతిథులుగా తరలిరానుండగా ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
హోమం తర్వాతే ప్రారంభం
వందమందికి సరిపడే విధంగా వేదికను సిద్ధం చేస్తున్నారు. వాస్తు ప్రకారం యాగశాల నిర్మాణం చేపట్టాలని... శృంగేరి పీఠం పండితులు ఫణి శశాంక్ శర్మ, గోపికృష్ణశర్మ సూచించడం వల్ల మేడిగడ్డ వద్ద యాగశాల నిర్మాణం చేపడుతున్నారు. మేడిగడ్డ, కన్నెపల్లిలో వరుణుడిని ఆహ్వానించే హోమ క్రతువు కార్యక్రమం చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ హోమం నిర్వహించిన అనంతరం ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఇదే సమయంలో మిగతా ఐదు చోట్ల పంపింగ్ స్టేషన్లను మంత్రులు ప్రారంభించనున్నారు.
పైలాన్ పనులు వేగవంతం
మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి ప్రాంతాల్లో హెలిప్యాడ్ల నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. కన్నెపల్లి వద్ద శిలాఫలకం, మేడిగడ్డలో పైలాన్ పనులు వేగవంతం చేశారు.
భద్రత కట్టుదిట్టం
ప్రారంభోత్సవానికి వచ్చే ప్రముఖుల భద్రతపై రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి బాధ్యత తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ప్రారంభోత్సవ సమయం దగ్గరపడుతుండగా...తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం... గోదావరి పరివాహకం, ప్రాజెక్టు ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.
మావోలపై పోలీసు నిఘా
ఇటీవల ఈ ప్రాంతంలో మావోల యాక్షన్ టీంలు సంచరించాయన్న ఇంటలిజెన్స్ నిఘా బృందాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మహదేవపూర్, పలిమెల అడవులు, సరిహద్దు ప్రాంతం, గోదావరి పరివాహక తీరం వెంబడి గ్రేహాండ్స్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. నక్సలైట్ల సమాచారం అందిస్తే బహుమతి అంటూ పోలీసులు పలు గ్రామాల్లో గోడపత్రికలను అంటించారు. 5 లక్షల నుంచి 20 లక్షల రివార్డు ఉన్న అగ్రనేతల ముఖచిత్రాలతో గోడపత్రికలు వేశారు.
రైతన్నల ఎదురుచూపు ఫలించే ఘడియ ఆసన్నమైన వేళ.. ఆ అపురూప ఘట్టం ఆవిష్కృతానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇదీ చూడండి : ఆదివాసీలకు పలువురి నాయకుల పరామర్శ