భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా తన బృందాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు. ఆర్ఎస్ఎస్ పెద్దల నుంచి ఈ విషయమై సూచనలు స్వీకరించాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు మార్చి 15 నుంచి 17 వరకు బెంగళూరులో జరగనున్న ఆర్ఎస్ఎస్ ప్రతినిధి సభకు నడ్డా విచ్చేయనున్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఈ ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టారు. మునుపటి అధ్యక్షుడు అమిత్ షా ఏర్పాటు చేసుకున్న బృందంతోనే అప్పటి నుంచి పని చేస్తున్నారు.
పార్టీ రాజ్యాంగం ప్రకారం కొత్త అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి నుంచి కార్యదర్శి వరకు కనీసం 25 శాతం మంది పదాధికారులను మార్చాల్సి ఉంటుంది. నడ్డా మాత్రం ప్రస్తుతం ఉన్న పదాధికారుల్లో కనీసం 33 శాతం మందిని యువ నాయకులతో భర్తీ చేయాలని భావిస్తున్నారు అని పార్టీ నేత ఒకరు తెలిపారు.
పార్లమెంటరీ బోర్డులోకి మహిళ
భాజపా పార్లమెంటరీ బోర్డులో ప్రస్తుతం మూడు ఖాళీలు ఉన్నాయి. అరుణ్‌జైట్లీ, సుష్మాస్వరాజ్, అనంత్కుమార్ల మరణాలతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి. ఇక ప్రస్తుత బోర్డులో జేపీ నడ్డా, నరేంద్రమోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, థావర్‌చంద్ గహ్లోత్, శివరాజ్ సింగ్ చౌహాన్, బీఎల్ సంతోష్‌లు ఉన్నారు. ఈ ఎనిమిది మందినీ కొనసాగించాలని కొత్త అధ్యక్షుడు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సుష్మా మృతితో ఈ బోర్డులో మహిళా సభ్యురాలికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ స్థానాన్ని ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న వసుంధర రాజే, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లలో ఒకరితో భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి:నారీ భేరి మోగాలి- సర్వతోముఖాభివృద్ధి దిశగా సాగాలి