రఫేల్ ఒప్పందంపై కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన నివేదికను కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నివేదికతో ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. ఫలితంగా కాగ్ తనంతట తానే హాస్యాస్పదమైందని ఎద్దేవా చేశారు.
" కాగ్ నివేదికలో విలువైన సమాచారమేమీ లేదు. కేవలం నిజాల్ని దాచిపెట్టడమే దీని ఉద్దేశం. రఫేల్ ఒప్పంద వివరాలు బయటపడాలంటే సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలి. నిష్ప్రయోజనమైన నివేదికను సమర్పించి కాగ్ తనంతట తానే హాస్యాస్పదమైంది. భవిష్యత్తులో మా ప్రభుత్వం కాగ్ ప్రతిష్టను పునరుద్ధరిస్తుంది. 33 పేజీల నివేదికలో రఫేల్ ఒప్పంద విలువ, విమానాల తయారీ సమయం గురించిన వివరాలు ఉంటాయనుకున్న వారికి నిరాశే మిగిలింది."
-పి చిదంబరం, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి
కాగ్ నివేదికలో ఏముంది..
రఫేల్ ఒప్పంద వివరాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నివేదికను కాగ్ బుధవారం పార్లమెంట్లో సమర్పించింది. గత యూపీఏ హయాంలోని ఒప్పందంతో పోలిస్తే 2.86 శాతం తక్కువ ధరకే ఎన్డీయే సర్కార్ డీల్ కుదుర్చుకుందని నివేదికలో పేర్కొంది. కొత్త ఒప్పందానికి సంబంధించిన ధర, విమానాల తయారీ సమయం వంటి ముఖ్యమైన అంశాలను ఇందులో ప్రస్తావించలేదు.