Contract Employees Regularization: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 80వేలకు పైగా కొత్త ఉద్యోగాల భర్తీతో పాటు 11వేలకు పైగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. సీఎం నిర్ణయానికి అనుగుణంగా ఆర్థికశాఖ కసరత్తు ప్రారంభించింది. అర్హులైన ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను కోరింది.
2016 ఫిబ్రవరి 26న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే రోజు అందుకు సంబంధించిన మెమో కూడా ఇచ్చింది. అయితే క్రమబద్ధీకరణపై కొందరు కోర్టుకు వెళ్లడం వల్ల 2017లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆ పిటిషన్‌ను 2021 డిసెంబర్ 7న ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో.. ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కోరారు.
2016లో జారీ చేసిన 16వ నంబర్ ఉత్తర్వునకు అనుగుణంగా అర్హులైన వారి ప్రతిపాదనలు పంపాలని సూచించారు. కేటాయింపు అయిన పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్‌కు అనుగుణంగా విధుల్లో ఉన్న ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ మాత్రమే సాధ్యమవుతుంది. ఆర్థికశాఖ పరిశీలన, ఆమోదం కోసం వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని పేర్కొన్నారు.