టక్ జగదీశ్ చిత్ర నిర్మాతలపై తెలంగాణ సినిమా థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ మేరకు ఎగ్జిబిటర్ల వ్యాఖ్యలను ఖండిస్తూ నిర్మాత దిల్ రాజు, ఠాగూర్ మధు సహా పలువురు అగ్ర నిర్మాతలతో కూడిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆగ్రహాం వ్యక్తం చేసింది. సినిమా థియేటర్స్ అసోసియేషన్ వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించింది.
సినిమాపై పూర్తి హక్కు, అధికారం నిర్మాతలకే ఉంటుందని నిర్మాతల గిల్డ్ స్పష్టం చేసింది. తన సినిమా ఎక్కడ, ఎప్పుడు విడుదల చేసుకోవాలో నిర్మాతల ఇష్టమని స్పష్టం చేసింది. ఎగ్జిబిటర్లు... డిమాండ్ ఉన్న పెద్ద సినిమాలపైనే దృష్టి పెడుతున్నారని నిర్మాతల గిల్డ్ విమర్శించింది. చిన్న సినిమాలను విస్మరిస్తున్నారని ఆరోపించింది. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లందరూ కలిసి ఉంటేనే సినీ పరిశ్రమ మనుగడ సాధ్యమవుతుందని సూచించిన నిర్మాతల గిల్డ్... కలిసి కట్టుగా పనిచేసి తెలుగు సినీపరిశ్రమ అభివృద్ధికి పాటుపడదామని ప్రకటనలో కోరింది.
వివాదం ఇక్కడ మొదలైంది..
'టక్ జగదీశ్' వివాదంపై చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ స్పందించింది. సినిమా విడుదలకు ఆలస్యం అవుతుండటం వల్లే 'టక్ జగదీశ్'ను ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించినట్లు నిర్మాతలు సాహు గారపాటి, హరీశ్ పెద్ది పేర్కొన్నారు. వాయిదాల వల్ల సినిమా పట్ల ప్రేక్షకులకు ఆసక్తి తగ్గే అవకాశం కూడా ఉందని తెలిపారు.
"మా సంస్థ నుంచి వస్తున్న రెండో చిత్రం 'టక్ జగదీశ్'. ఇందులో హీరోగా నేచురల్ స్టార్ నానిని సంప్రదించాం. ఈ చిత్రం కోసం రెండేళ్లు శ్రమించాం. గత ఏడాది డిసెంబరులోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఈ వేసవికి విడుదల చేయాలని భావించినా.. కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ డిజిటల్ యుగంలో ఈ సినిమా కంటెంట్‌ను ఎక్కువ కాలం కాపాడుకోలేం. ఇవన్నీ ఆలోచించి.. మరో దారి లేనందు వల్లే మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీనిపై మొదట నాని, దర్శకుడు అసంతృప్తి చెందినా.. పరిస్థితిని అర్థం చేసుకున్నారు. మా ఇబ్బందులను అర్థం చేసుకుని ఓటీటీ విడుదల పట్ల తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించిన నానికి మా ధన్యవాదాలు." -నిర్మాతలు
థియేటర్స్ అసోసియేషన్‌పై తెలుగు నిర్మాతల గిల్డ్ వ్యాఖ్యలు
- చిత్ర పరిశ్రమకు చెందిన సభ్యులను కించపరిచేలా తెలంగాణ స్టేట్ ఫిల్మ్ థియేటర్స్ అసోసియేషన్ ఆఫీసర్ బేరర్స్ సమక్షంలో పలువురు చేసిన వ్యాఖ్యలను యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీవ్రంగా ఖండిస్తోంది. తొలుత సినిమా నిర్మాణాన్ని ప్రారంభించేది నిర్మాతే. నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి సినిమాకు పునాది వేసేది నిర్మాతే. ప్రాథమికంగా థియేటర్లలో విడుదల చేయాలని ఎల్లప్పుడూ భావిస్తాడు. గతంలో శాటిలైట్, ఇప్పుడు వివిధ ఓటీటీ మాధ్యమాల రాకతో... ఈ మార్గాలు అన్నిటి ద్వారా నిర్మాత తన పెట్టుబడిని రాబట్టుకుంటాడు. తన చిత్రాన్ని ఎప్పుడు, ఎక్కడ విడుదల చేయాలనే నిర్ణయం తీసుకునే హక్కు నిర్మాతది.
- ఓటీటీ మాధ్యమంలో తమ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో, నిర్మాతను సభాముఖంగా విమర్శించడం, వ్యక్తిగతంగా బెదిరించడం సరికాదు. ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం అనిపించుకోదు. తన చిత్రంపై సర్వహక్కులు నిర్మాతకు చెందుతాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మార్కెట్ ఉన్న హీరోలు చాలామంది ఉన్నారు. అందువల్లే, పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది. ప్రత్యేకంగా ఒక హీరోను ఎవరైనా టార్గెట్ చేయడం ద్వారా పరిశ్రమలోని ఆరోగ్యకర, స్నేహపూర్వక సంబంధాలను దెబ్బ తీస్తుంది.
- పరిశ్రమ ఎదుర్కొంటోన్న వివిధ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాతలకు సహాయపడమని వివిధ వేదికల్లో ఎగ్జిబిటర్లకు మేం విజ్ఞప్తి చేశాం. ఇవాళ, ఎగ్జిబిటర్లు కేవలం విపరీతమైన డిమాండ్ ఉన్న సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. చిన్న, ఓ మాదిరి చిత్రాలను పట్టించుకోవడం లేదు. వాటిని విస్మరిస్తున్నారు. దాంతో చాలా చిత్రాలు వివిధ మార్గాల ద్వారా తమ పెట్టుబడిని రాబట్టుకుంటున్నాయి.
- పరిశ్రమ పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, వివిధ వ్యాపార భాగస్వాములు.... పరస్పరం ఒకరిపై మరొకరు ఆధారపడిన పరిశ్రమ మనది. వ్యక్తిగతంగా, పరిశ్రమగా మనమంతా కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్నాం. అన్ని సెక్టార్లు కష్టకాలంలో ఉన్నాయని మేం అర్థం చేసుకున్నాం. వారితో పాటు మేం బాధపడుతున్నాం. పరస్పన మద్దతు ఆశిస్తున్నాం. గతంలో మనం ఎదుర్కొన్న సమస్యలకు అందరం కలసికట్టుగా పరిష్కార మార్గాలను అన్వేషించాల్సిన సమయం వచ్చిందని మేం భావిస్తున్నాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం మనమంతా సమష్టిగా పని చేయాలి.
ఇదీ చూడండి: 'బ్యాంకులు, అపార్ట్‌మెంట్లలో థియేటర్లు'