Punjab Election postponed: పంజాబ్ శాసనసభ ఎన్నికలను వాయిదా వేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 14కు బదులుగా.. ఫిబ్రవరి 20న నిర్వహించాలని నిర్ణయించింది. వేర్వేరు రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 16న రవిదాస్ జయంతి ఉంది. ఈ సందర్భంగా లక్షలాది మంది పంజాబీలు ఉత్తర్ప్రదేశ్ వారణాసికి వెళ్తుంటారు. ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది తమ ఓటు హక్కును ఉపయోగించుకునే అవకాశం ఉండదని రాజకీయ పార్టీలు పేర్కొంటున్నాయి. ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ జనవరి 13న ఈసీకి లేఖ రాశారు. బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఆ వర్గానికి చెందినవారు దాదాపు 32శాతంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారు.
భాజపా, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. గురు రవిదాస్ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరాయి.
ఇదీ చూడండి: 'రిపబ్లిక్ డే'కు ఘన ఏర్పాట్లు.. నభూతో అనేలా వాయుసేన విన్యాసాలు!