ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి(KRMB, GRMB Boards Meeting) సమావేశం జరగనుంది. హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 గంటలకు కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం నిర్వహించనున్నారు. అత్యవసరంగా ఏర్పాటు చేసిన భేటీలో గెజిట్‌లోని అంశాల అమలు కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ మేరకు కేఆర్ఎంబీ సభ్యకార్యదర్శి రాయిపురే రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు. అజెండా అంశాలపై చర్చకు సంబంధించిన డాక్యుమెంట్లతో సమావేశానికి హాజరు కావాలని బోర్డు సభ్యులను కోరారు.
ఈనెల 3వ తేదీన గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ జరిగింది. హైదరాబాద్ జలసౌధలో జీఆర్ఎంబీ సమన్వయ కమిటీ సమావేశంలో కేంద్ర జల్‌శక్తి గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు ఏపీ నుంచి ఆ రాష్ట్ర ఈఎన్సీలు నారాయణరెడ్డి, సతీశ్, ట్రాన్స్‌కో, జెన్‌కో ఎండీలు శ్రీకాంత్, శ్రీధర్ వచ్చారు. అంతకు ముందు రోజు గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు. ముందుగా గోదావరి బోర్డు పూర్తిస్థాయి భేటీ జరగాలని కోరారు. ఈ దశలో ఈనెల 9న కృష్ణా, గోదావరి బోర్డుల ఉమ్మడి (KRMB, GRMB Boards Meeting) సమావేశం జరపాలని నిర్ణయించారు.
ఇదీ ఇలా ఉండగా కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన వాయిదా పడింది. ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు బుధవారం వెల్లడించారు. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలన తేదీని తర్వాత వెల్లడిస్తామని కేఆర్‌ఎంబీ తెలిపింది. తెలుగు అధికారులు ఎవరూ లేకుండా పర్యటించాలని ఎన్జీటీ ఆదేశంతో కృష్ణా బోర్డు బృందం పర్యటించేందుకు సిద్ధమైంది. తెలంగాణ అధికారి ఉండకూడదని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో పిటిషన్ వేసింది. తనిఖీ బృందంలో సీడబ్ల్యూసీలో పనిచేస్తున్న దేవేందర్‌రావు పేరును చేర్చడంపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ జరిపిన ఎన్జీటీ.. తెలుగు వ్యక్తులు లేకుండా వెళ్లాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. ఈనెల 9న నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. తాజాగా పర్యటన వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: Dalitha Bandhu: వాసాలమర్రికి విడుదలైన దళితబంధు నిధులు.. సంబురాల్లో గ్రామస్థులు