Funerals stopped in Inavolu: హనుమకొండ జిల్లా ఐనవోలులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు నుంచి దారి లేదంటూ రెండ్రోజులుగా శవయాత్ర సాగకుండా అడ్డుకున్నారు ఇరుగుపొరుగు. వారి మూర్ఖత్వంతో రెండ్రోజులుగా దహన సంస్కారాల కోసం మృతుడి కుటుంబం దయనీయంగా ఎదురుచూస్తోంది.
Funerals stopped news: ఐనవోలుకు చెందిన బరిగెల సురేష్(28) నిన్న అనారోగ్యంతో మృతి చెందారు. సురేష్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లిన కుటుంబీకులు, బంధువులకు చుట్టుపక్కల వారి నుంచి చుక్కెదురైంది. సురేశ్ అంత్యక్రియలకు కుటుంబీకులు ఏర్పాట్లు చేసి శ్మశానవాటికకు తీసుకువెళ్తుండగా.. దారి ఇవ్వబోమంటూ ఇరుగుపొరుగు అడ్డుకున్నారు. ఇంటి ముందు వారు గతంలోనే గోడ నిర్మాణం చేపట్టగా.. తాజాగా పక్కింటి వారు ముళ్ల కంపలు అడ్డు వేశారు. శవయాత్రకు దారి ఇవ్వబోమని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజులుగా మృతదేహం అలాగే ఉండటంతో దుర్వాసన వెదజల్లుతోందని.. తమ ఇంటి ప్రాంగణంలోనే మృతదేహాన్ని పాతి పెట్టేందుకు కుటుంబీకులు యత్నించారు. అయితే దీనిని కూడా స్థానికులు అడ్డుకొని వారించారు.
ఇంత జరుగుతున్నా గ్రామ ప్రజాప్రతినిధులు గానీ.. అధికారులు గానీ ఇప్పటి వరకూ స్పందించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఎలాగైనా దారి చూపించి సురేష్ అంత్యక్రియలు జరిగేలా చూడాలని.. లేదంటే ఇంటి ప్రాంగణంలోనే శవాన్ని పూడ్చి వేసుకుంటామని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: Allu Arjun fans attack on theatre owner: 'మేము లోకల్స్.. మాకు పుష్ప టికెట్లు ఇవ్వరా?'