'మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2021' కిరీటాన్ని ముంబయికి చెందిన 26 ఏళ్ల అందాల భామ జోయా అఫ్రోజ్ దక్కించుకుంది. గ్లామానంద్ సూపర్‌మోడల్ ఇండియా పేరుతో జరిగిన ఈ పోటీల్లో విజేతగా నిలిచిన జోయా, ఈ ఏడాది నవంబరులో జపాన్‌లో నిర్వహించనున్న 'మిస్ ఇంటర్నేషనల్ 2021' పోటీల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.
మూడేళ్ల వయసులోనే బాలనటిగా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన జోయా బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లోనూ మెరుస్తోంది. వెబ్ సిరీసుల్లోనూ పేరు తెచ్చుకుంటున్న ఆమె.. పాండ్స్, ఏషియన్ పెయింట్స్ వంటి ప్రముఖ సంస్థలకు మోడల్ కూడా. 2013లో 'ఫెమినా మిస్ ఇండియా' పోటీలో రెండో రన్నరప్‌గా నిలిచిన ఈమె, ఇప్పుడు 'మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2021'తోపాటు 'బెస్ట్ ఇన్ ఈవెనింగ్ గౌన్', 'మిస్ గ్లామరస్ ఐస్', 'టాప్ మోడల్' సబ్ టైటిల్స్‌నూ సొంతం చేసుకుంది.
మహిళలకు విద్య, ఆర్థిక స్వాతంత్య్రం’ వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన కలిగించే దిశగా జోయా అఫ్రోజ్ కృషి చేయనుంది. "ప్రతి స్త్రీకి తన కలను సాకారం చేసుకునే హక్కు ఉంది. దాన్ని సాధించడం కోసం నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి" అంటున్న జోయా.. 'మిస్ ఇంటర్నేషనల్ 2021' కిరీటాన్ని దక్కించుకోవాలని ఆశిద్దాం.
ఇదీ చూడండి.. మనసుల్ని దోచిన మిస్ ఇండియా సమాధానం