YSRCP Incharge Second List : అధినాయకత్వం నుంచి ఎప్పుడు పిలుపొస్తుందో తెల్లారితే ఏం వార్త వినాల్సి వస్తోందోనని ఏపీలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తరతరాలుగా నియోజకవర్గంలో కాపాడుకుంటూ వస్తున్న పలుకుబడి నమ్ముకున్న కేడర్, కార్యకర్తలను వదిలి తట్టాబుట్టా సర్దుకుని వేరొక చోటకి వలసపోవాల్సి వస్తోంది.
AP Elections 2024 : వైఎస్సార్సీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల టికెట్లతో అధినాయకత్వం బంతాట ఆడుతోంది. మంత్రులను MPలుగా, ఎంపీలను MLAలుగా, ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా మార్చేస్తోంది. తొలి విడతలో 11 మంది అభ్యర్థులను మార్చిన వైఎస్సార్సీపీ మలివిడతలో మరో 27 స్థానాల్లో మార్పులు, చేర్పులు చేయడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
CM Jagan Changed Incharge : ఎన్నికల సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో తిరిగి బలాన్ని కూడగట్టుకోవాల్సిన సమయంలో అసలు తాము ఆ నియోజకవర్గంలో ఉంటామో లేదోనన్న అయోమయంతో ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నారు. మంగళవారం కూడా మరో 20 మంది సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ పరిస్థితి ఏంటని తెలుసుకున్నారు. తాజా జాబితాలో ఎస్సీ ఎమ్మెల్యేలు కొండేటి చిట్టి బాబును పూర్తిగా పక్కన పెట్టేయగా గొల్ల బాబూరావు స్థానంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులును తీసుకొచ్చారు. బాబూరావును రాజ్యసభకు పంపుతున్నారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి.
27 మందితో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల
YSRCP Strategy : ఎమ్మెల్యేలకే కాదు మంత్రులకు సైతం స్థానచలనం తప్పలేదు. ఉష శ్రీచరణ్‌ను కళ్యాణదుర్గం నుంచి పెనుకొండకు, వేణుగోపాలకృష్ణను రామచంద్రపురం నుంచి రాజమహేంద్రవరం గ్రామీణానికి మార్చారు. అనకాపల్లిలో గుడివాడ అమర్నాథ్‌కు అవకాశం ఇవ్వలేదు. ఆయనకు ఎక్కడ అవకాశం కల్పిస్తారో చెప్పలేదు. ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరు జయరాంను కర్నూలు లోక్‌సభ అభ్యర్థిగా దాదాపు ఖరారు చేశారంటున్నారు. దీన్నింకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అనంతపురం ఎంపీ తలారి రంగయ్యను కల్యాణదుర్గం అసెంబ్లీకి మార్చారు.
ఎంపీ తలారి రంగయ్యకు, మంత్రి ఉష శ్రీచరణ్‌కు ఎప్పటి నుంచో వర్గపోరు నడుస్తోంది. రంగయ్య వర్గానికి చెందిన నేత కల్యాణదుర్గం పురపాలక ఛైర్మన్‌గా ఎన్నికైనా ఆయన బాధ్యతలు చేపట్టకుండా మంత్రి అడ్డుకున్నారని ఎంపీ వర్గం గుర్రుగా ఉంది. ఇరువర్గాలు పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ వర్గపోరును సర్దుబాటు చేసేందుకే రంగయ్యను కళ్యాణదుర్గానికి, మంత్రి ఉషను పెనుకొండకు మార్చినట్లు తెలుస్తోంది. రంగయ్య సామాజిక వర్గం ఓట్లు కళ్యాణదుర్గంలో ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇరువర్గాల మధ్య వర్గపోరు : రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ఈసారి రాజమహేంద్రవరం అసెంబ్లీకి పోటీ చేయాలని మొదటి నుంచీ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ పాగా వేసేందుకు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సైతం పావులు కదపడంతో ఇరువర్గాల మధ్య వర్గపోరు నడిచింది. ఈ సీటుపై కన్నేసిన ఇరువురూ ఎప్పటికైనా అక్కడ నుంచి పోటీ చేయాలనే రాజకీయంగా ప్రాధాన్యం లేని వారిని నియమింపజేస్తున్నారు. అయితే అధినాయకత్వం భరత్ వైపే మొగ్గు చూపింది. అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగా గీత సైతం ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. తాము కోరుకున్న స్థానాలపై ఎక్కువగా దృష్టిసారించారు. మాధవి పాడేరు, అరకుపై ఆశలు పెట్టుకోగా ఆమెను అరకు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది.
ఆయనకు టిక్కెట్ ఇస్తే సహించం : గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన పిఠాపురంపై వంగా గీత దృష్టి సారించగా అదే సీటును ఆమెకు కేటాయించింది. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్షిని అరకు లోక్‌సభకు, పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణను అనంతపురం లోక్‌సభ సమన్వయకర్తలుగా పార్టీ నియమించింది. శంకరనారాయణపై పెనుకొండలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనకు టిక్కెట్ ఇస్తే సహించబోమని దిగువస్థాయి నేతలు హెచ్చరించారు. అయితే శంకరనారాయణ సామాజికవర్గ ఓట్లు అనంతపురం జిల్లాలో అధికస్థాయిలో ఉన్నాయి. ఆయన్ను పూర్తిగా పక్కనపెడితే ఇబ్బందులు తప్పవని గ్రహించిన అధిష్టానం అనంతపురం లోక్ సభ టిక్కెట్ ఖరారు చేసింది. బళ్లారికి చెందిన మాజీమంత్రి శ్రీరాములు సోదరి శాంత మంగళవారం ఉదయం పార్టీలో చేరగా సాయంత్రానికి ఆమెకు ఎంపీ టిక్కెట్ ఖరారైంది. హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించారు. ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు.
వైసీపీ ఇంచార్జ్‌లు నియామకం - మార్పుల వెనుక డబ్బు-లాబీయింగ్ గట్టిగా పని చేసిందని ప్రచారం
దిగొచ్చిన వైఎస్సార్సీపీ అధిష్టానం : మాజీమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ పట్టుబట్టి తన సొంత నియోజకవర్గం రామచంద్రపురాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగానే పోరాడాల్సి వచ్చింది. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వేణుగోపాలకృష్ణతో ఆయన యుద్ధమే చేయాల్సి వచ్చింది. బోస్ వర్గీయులపై మంత్రి మనుషులు దాడికి దిగేంత వరకు పరిస్థితి వెళ్లింది. తనకు లేదా తన కుమారుడికి టిక్కెట్ ఇవ్వకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీ చేస్తానని బోస్ హెచ్చరించడంతో వైఎస్సార్సీపీ అధిష్టానం దిగొచ్చింది. ఆయన కుమారుడిని రామచంద్రాపురం సమన్వయకర్తగా నియమించింది. మంత్రి వేణును రాజమండ్రి రూరల్‌కు పంపింది.
రంగంలోని వారసులు-తెగేసి చెప్పిన జగన్ : సిటింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అటు ఇటుగా మార్పులు చేర్పులు చేయగా మరికొందరికి వైఎస్సార్సీపీ మొండిచేయి చూపింది. మంత్రి గుడివాడ అమరనాథ్‌తో పాటు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు టిక్కెట్లు గల్లంతయ్యాయి. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజుకు బదులు ఆయన భార్య రాజ్యలక్ష్మికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.
కొందరు ఎమ్మెల్యేలు ఈసారి తమ వారసులకు అవకాశం కల్పించాలని పలుమార్లు జగన్‌కు విజ్ఞుప్తి చేసినా ఆయన వద్దని నిర్మొహమాటంగానే చెప్పేవారు. వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా జగన్ కాస్త తగ్గినట్లు కనిపించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్థానంలో ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డికి, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్థానంలో కుమారుడు మోహిత్‌రెడ్డి, మచిలీపట్నంలో పేర్నినాని కుమారుడు కృష్ణమూర్తికి, రామచంద్రపురంలో బోస్ కుమారుడు సూర్యప్రకాశ్‌కు టిక్కెట్లు ఖరారు చేశారు. గుంటూరు తూర్పు MLA షేక్ ముస్తఫాకు బదులు ఆయన కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్ ఇచ్చారు.
మార్పు మొదలైంది - వైసీపీ కొత్త ఇన్‌ఛార్జ్‌ల నియామకంతో అసంతృప్తి సెగలు