YSRCP Changed Constituency Incharge : వైఎస్సార్సీపీలో దళితులు, బడుగులనే బలి చేస్తున్నారని, వ్యతిరేకత ఉన్నా సీఎం సామాజికవర్గ నేతల్ని కొనసాగిస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి. టికెట్ల విషయంలో అసలు సిసలు పెత్తందారీ విధానాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అమలు చేస్తూ బడుగు బలహీనవర్గాలను బలిపెట్టింది. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల విషయంలో ఒక ప్రధాన సామాజికవర్గం వారైతే ఒక లెక్క. బడుగు బలహీనవర్గాలైతే వేరే లెక్క అనే విధానాన్ని పాటించారు. రెండు దఫాల్లో 38 మార్పులు చేస్తే వాటిలో 25 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్థానాల్లో చేసినవే.
CM Jagan Changed Incharge of BC SC ST Leaders : పనితీరు బాగోలేదని నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందనిఎమ్మెల్యేలు, సమన్వయకర్తలను మారుస్తున్నారు. ఇవన్నీ బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే పరిమితమా? సీఎం సొంత సామాజికవర్గ ఎమ్మెల్యేలకు వర్తించవా అని వైఎస్సార్సీపీలోని దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యతిరేకత ఉన్నా అగ్రవర్ణాల వారిని కొనసాగిస్తున్నారంటూ ఎమ్మెల్యే బాబు చేసిన వ్యాఖ్యలు వర్గం ఆవేదనకు అద్దం పడుతున్నాయి.
వైఎస్సార్సీపీ ఇన్‌ఛార్జుల మార్పులు చేర్పులు - నేతలతో జగన్ బంతాట
CM Jagan Cheating YSRCP Leaders : రెండు దఫాల్లో చేసిన మార్పుల్లో పక్కన పెట్టేసిన వారి వివరాలను పరిశీలిస్తే తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేల టికెట్లను వారి వారసులకే ఇచ్చారు. పోలవరంలో బాలరాజుకు బదులు ఆయన భార్యకు అవకాశం ఇచ్చారు. వీరు కాకుండా టికెట్లు కోల్పోయిన మిగిలిన 13 మందిలో ఎస్సీలు-3, బీసీ-1, ఎస్టీ-1, కాపు-3, రెడ్డి-3, ఇతర ఓసీలు-2. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ 2019లో టీడీపీ తరపున గెలిచి, తర్వాత వైఎస్సార్సీపీ గూటికి చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి వ్రతం చెడ్డా ఫలం లేదన్నట్లుగా మారింది. టికెట్లు కోల్పోయిన సమన్వయకర్తలు అయిదుగురు ఉండగా వారిలో ముగ్గురు బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఓసీ ఉన్నారు.
అమర్నాథ్‌కు వెన్నుపోటు : ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, విడదల రజిని, ఉష శ్రీచరణ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను వారి సిటింగ్ స్థానాల నుంచి మార్చేశారు. ఆదిమూలపు సురేష్‌కు ఇది వరుసగా మూడో మార్పు. మేరుగు నాగార్జునను జిల్లా దాటించేశారు. కాపు సామాజికవర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్‌కు టికెట్ ఉందో, లేదో తెలియదు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను తిట్టేందుకు అమర్నాథ్‌ను ఉపయోగించుకున్న వైఎస్సార్సీపీ అధిష్ఠానం ఇప్పుడు ఆయనకు ఎసరు పెట్టింది.
వైఎస్సార్సీపీ రిజర్వుడు స్థానాల్లో రెడ్లదే పెత్తనం
వైఎస్సార్సీపీ వర్గాల్లో చర్చ : బాబాయ్ హత్య కేసులో నిందితుడిగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి మూటగట్టుకున్న అపఖ్యాతి కంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? కర్నూలులో సీబీఐని ముప్పుతిప్పలు పెట్టి ఆయన్ను అరెస్టు చేయనివ్వకుండా కాపాడుకున్నట్లే ఇప్పుడు ఎంపీగానూ కాపాడుతున్నారు. ఎంపీగా ఆయన పని తీరు బాగుందనే భావనకు ఎలా వచ్చారు? సీఎం తమ్ముడన్న ఒక్క కారణమే ఆయన్ను ఎంపీగా కొనసాగించేందుకు దోహదపడుతోందా అనే చర్చ ఇప్పుడు వైఎస్సార్సీపీ వర్గాల్లో జరుగుతోంది.
విభజన హామీలను మరిచిన ఏంపీ : వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేతగా పీవీ మిథున్‌రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. లోక్‌సభలో నాలుగో అతి పెద్ద పార్టీ అయిన వైఎస్సార్సీపీ నాయకుడిగా ఉంటూ ఆయన రాష్ట్రానికి సాధించిందేంటి? విభజన హామీల్లో ఒక్కదాన్నయినా నెరవేర్చుకోగలిగారా? కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకునేందుకు పదవిని వాడుకుంటున్నందుకు ఆయనను కొనసాగిస్తున్నారా? అని వైఎస్సార్సీపీలోని బలహీనవర్గాల నాయకులు చర్చించుకుంటున్నారు.
అనంతపురం జిల్లాలో ఉన్న రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ అభ్యర్ధులను మార్చేశారు. సిటింగ్ ఏంపీలు ఇద్దరిలో ఒకరిని కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు. మరో ఎంపీని పూర్తిగా పక్కన పెట్టేశారు.
వారసులకే టికెట్లు : తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిల టికెట్లను వారి వారసులు అభినయ్ రెడ్డి, మోహిత్‌రెడ్డికే కట్టబెట్టారు. ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి నేరుగా టికెట్ ఇవ్వకపోయినా ఆ నియోజకవర్గాన్ని ఆయన గుప్పిట్లోనే ఉంచారు. ఆయన తీసుకొచ్చిన మాచిన వెంకటేష్‌కు టికెట్ ఖరారు చేశారు. చెన్నకేశవరెడ్డి ఆధిపత్యం ఉంటుందని హామీ ఇచ్చాకే ఇక్కడ మార్చారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, కదిరిలో పీవీ సిద్ధారెడ్డిలకు పూర్తిగా టికెట్ లేకుండా పోయింది.
27 మందితో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల