YSR 74th birth anniversary celebrations: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత గొప్ప నాయకుడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన చేసిన సేవలు అనన్య సామాన్యమని ఆయన కుమార్తె వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ఆర్ 74వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఘాట్ వద్ద షర్మిల, విజయమ్మ కుటుంబ సభ్యులు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోసం ఉచిత విద్యుత్ పైన తొలి సంతకం చేసిన మహోన్నత వ్యక్తి.. వైఎస్ఆర్ అని షర్మిల వ్యాఖ్యానించారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పేదలకు పోడు భూములు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని ఆమె మీడియాతో అన్నారు. ఐదేళ్లలో 46 లక్షల ఇల్లు పేదవాళ్లకు కట్టించాడనీ ఆమె గుర్తు చేశారు. ప్రతి హృదయాన్ని గెలుచుకున్న నేత రాజశేఖర్ రెడ్డి అని... వైయస్ జయంతి సందర్భంగా మరోసారి ఆయన్ని స్మరించుకునే అవకాశం వచ్చిందనీ షర్మిల తెలిపారు. రాజశేఖర్ రెడ్డిని ప్రేమించే ప్రతి గుండెకు ప్రతి పేదవానికి ఆయన కుటుంబం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుందనీ షర్మిల వెల్లడించారు.
వేర్వేరు సమయాల్లో నివాళి: గతానికి భిన్నంగా ఈ సారి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన ఘాట్ వద్ద సీఎం జగన్, వైటీపీ అధ్యక్షురాలు షర్మిల వేర్వేరు సమయాల్లో నివాళి అర్పించారు. ఈ మేరకు ఇద్దరి పర్యటన వివరాలు వెలువడ్డాయి. గతంలో కలిసే నివాళులు అర్పించినా.. ఈసారి వీరివురు వేర్వేరుగా ఇడుపులపాయకు రావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. షర్మిల శుక్రవారం రాత్రే ఇడుపులపాయకు చేరుకున్నారు. మరుసటి రోజు ఉదయం తల్లి విజయమ్మతో కలిసి నివాళులర్పించి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. సీఎం జగన్ మధ్యాహ్నం తరువాత ఇడుపులపాయకు చేరుకున్నారు. కాగా.. వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఇడుపులపాయలో ఆయనకు నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
మారిన పరిణామాలు: జగన్, షర్మిల మధ్య విభేదాలు తలెత్తిన తర్వాత కూడా ఇద్దరూ ఒకే సమయంలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేవారు. గత ఏడాది ఇద్దరూ ముభావంగా ఉన్నప్పటికీ.. తల్లితో కలిసి వైఎస్ ఘాట్‌కు వచ్చారు. ఈసారి తండ్రి జయంతి రోజున ఉదయం కాకుండా.. మధ్యాహ్నం జగన్ ఇడుపులపాయకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిలను చూడటం ఇష్టం లేకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనే జగన్ మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఈసారి విదేశీ పర్యటనలో ఉండటం గమనార్హం.