ఈశాన్య దిల్లీలోని సుందర్ నగరిలో దారుణం జరిగింది. ఓ దళిత యువకుడిని ముగ్గురు వ్యక్తులు కత్తులతో పొడిచి హత్య చేశారు. నిందితులు సంవత్సరం క్రితం చేసిన హత్య కేసులో బాధితుడు మనీశ్ ప్రత్యక్ష సాక్షి. ఈ క్రమంలో మనీశ్‌ను సాక్ష్యం చెప్పొద్దని బెదిరించారు నిందితులు. అయితే మనీశ్ కొద్ది రోజుల క్రితం సాక్ష్యం చెప్పడం వల్ల ఆగ్రహించిన నిందితులు హత్య చేశారు. శనివారం జరిగిందీ ఘటన. నిందితులను బిలాల్, ఆలం, ఫైజాన్గా పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం మనీశ్ ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వస్తున్న సమయంలో ముగ్గురు నిందితులు కత్తులతో వచ్చారు. మనీశ్‌ను అడ్డగించారు. ఈ క్రమంలో పలుమార్లు బాధితుడిపై కత్తిపోట్లు కురిపించారు. దీంతో మనీశ్‌కు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని జీటీబీ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం కావడం వల్ల మనీశ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ దాడి దృశ్యాలన్ని స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. హత్య జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల జనాలు ఉన్నా.. ఎవరూ నిందుతులను ఆపే ప్రయత్నం చేయలేదు.
మనీశ్.. హత్యతో అతని స్వస్థలం సుందర్ నగరీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లు దిగ్భందానికి ప్రయత్నించారు బాధితుడి కుటుంబ సభ్యులు. ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భాజపా ఎంపీ మనీశ్ తివారీ డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: 'గాంధీ సిద్ధాంతాలు చెప్పడం సులువే.. పాటించడమే కష్టం'.. కేంద్రానికి రాహుల్ చురక
ఐసీయూలో ములాయం.. ఆస్పత్రికి అఖిలేశ్.. ఆరోగ్యం స్థిరంగానే ఉందన్న వైద్యులు