దేశంలో బ్లాక్, వైట్ ఫంగస్‌లు క్రమంగా విస్తరిస్తున్న వేళ ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో తొలిసారిగా ఎల్లో ఫంగస్ కేసు నమోదైంది. దేశంలో ఇదే మొట్టమొదటి ఎల్లో ఫంగస్ కేసు. సంజయ్ నగర్‌కు చెందిన 45ఏళ్ల వ్యక్తి శరీరంలో ఈ ఫంగస్‌ను గుర్తించారు హర్ష ఈఎన్టీ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ బీపీ త్యాగి. ఇతర ఫంగస్ల కంటే ఈ వ్యాధి ప్రమాదకరమైనదని తెలిపారు. సిటీ స్కాన్‌లో.. అతడి సైనస్ సాధారణంగానే ఉందని, ఎండోస్కోపీలో మాత్రం.. రోగిలో బ్లాక్, వైట్, ఎల్లో ఫంగన్‌ను గుర్తించామని వివరించారు. ఎల్లో ఫంగస్ సహజంగా భూమి మీద పాకే జంతువుల్లో ఉంటుందని, మనుషుల్లో తొలిసారి గుర్తించామని పేర్కొన్నారు.
లక్షణాలు..
ఎల్లో ఫంగస్ సోకిన వ్యక్తికి విపరీతమైన నీరసం, ఆకలి బాగా తగ్గిపోవడం లేదా అసలు ఆకలి లేకపోవడం, క్రమంగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో గాయాలు త్వరగా తగ్గకపోవడం, వాటి నుంచి చీము కారడం, శరీరంలోని కీలక అవయవాలు విఫలం కావడం, కళ్లు పీక్కుపోవడం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. ఎల్లో ఫంగస్ సమస్య శరీరం లోపల ప్రారంభం అవుతుందని, లక్షణాలను గుర్తించిన వెంటనే చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.
ఎల్లో ఫంగస్ ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల వస్తుందని భావిస్తున్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఫంగస్ చేరే అవకాశం ఉన్న, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పడేయడం ఉత్తమమని చెబుతున్నారు. ఎల్లో ఫంగస్ చికిత్సకు ప్రస్తుతం ఆంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్ ఒక్కటే ఉందని తెలిపారు.
కేరళలో నలుగురు..
కేరళలో మ్యూకర్మైకోసిస్( బ్లాక్ ఫంగస్) బారిన పడి మరో నలుగురు ఆదివారం మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు ఎర్నాకుళం, మరో ఇద్దరు పతనంతిట్టకు చెందిన వారుగా అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి : కుక్కల నుంచి మనుషులకు కరోనా.. నిజమేనా?