Yediyurappa criminal case: భాజపా సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై నమోదైన భూ ఆరోపణలపై ప్రత్యేకంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భూసంబంధిత డీనోటిఫికేషన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడ్డారని యడియూరప్పపై ఆరోపణలున్నాయి.
యడియూరప్పపై 2013లోనే ఈ ఫిర్యాదు నమోదైంది. ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలోనూ అవినీతి జరిగిందని.. వాసుదేవరెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'బెంగళూరు ఐటీ కారిడార్ స్థలం విషయంలో భూఅక్రమాలు జరిగాయని.. డీనోటిఫికేషన్ తర్వాత ఆ స్థలాలను పలువురు పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టారని' ఆరోపించాడు. ఈక్రమంలోనే అవినీతి వ్యతిరేక నిరోధక చట్టం 1988 కింద.. ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రత్యేక కోర్టు ముందు హాజరు కావాలని నోటీసుల్లో తేల్చి చెప్పింది. ఇటీవల భాజపా అధిష్ఠానం ఆదేశాల మేరకు సీఎం పదవి నుంచి యడియూరప్ప తప్పుకున్నారు. అప్పటినుంచి కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఉన్నారు.
ఇదీ చదవండి: ఓటమి నేర్పిన పాఠం.. కాంగ్రెస్లో చలనం