సాధారణంగా సీజన్‌తో పాటు మార్కెట్ డిమాండ్ బట్టి కిలో మామిడి రేటు రూ.100 నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది. కానీ, ఈ కొత్తరకం మామిడి ధర వింటే మాత్రం షాక్ తినాల్సిందే. కిలో మామిడి పండ్లు ఏకంగా రూ.2.7లక్షలు పలుకుతాయి. జపాన్‌కు చెందిన మియాజాకి నగరం పేరుతో సాగయ్యే ఈ మామిడి రకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. గత సీజన్‌లోనే దీన్ని జపాన్‌లో కిలో రెండున్నర లక్షల రూపాయల చొప్పున విక్రయించారు. ఇంతటి ఖరీదైన మామిడిని ఇప్పుడు భారత్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్‌తో పాటు ఫిలిప్పీన్స్‌లోనూ సాగు చేస్తున్నారు.
ఈ రకానికి చెందిన ఒక్కో మామిడి పండు బరువు దాదాపు 330 గ్రాములు ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ బీటా-కెరోటిన్‌తో పాటు ఫోలిక్ యాసిడ్ లక్షణాలను కలిగి ఉన్న ఈ పండులో చక్కెర 15 నుంచి 20 శాతం మాత్రమే ఉంటుంది. అందుకే ఈ పండు మరింత రుచిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్లో ఓ రైతు తన తోటలోని ఈ రకం మామిడి సాగు చేశారు. పండ్ల దొంగతనాలను అరికట్టేందుకు నలుగురు కాపలాదారులను, శునకాలను పెట్టడం వల్ల ఈ మామిడి జాతి దేశమంతటా ట్రెండింగ్ అయ్యింది.
ఇప్పుడు జబల్పుర్లోనే కాకుండా ఇందోర్, భోపాల్‌తో సహా ఇతర ప్రాంతాలలో ఈ ఖరీదైన మామిడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతులు సైతం దీన్ని పండించటానికి మొగ్గు చూపిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఓ నర్సరీ నిర్వాహకుడు మహేంద్ర కుమార్ గుప్తా..ఈ ఖరీదైన మామిడి నారులపై దాదాపు మూడేళ్లు పరిశోధన చేసి మొక్కలను సిద్ధం చేశారు. అంతే కాకుండా ఇందోర్‌లోని కొంతమంది రైతుల కోసం దీన్ని అందుబాటులో ఉంచారు.