కరోనా రెండోదశ విజృంభిస్తోన్న వేళ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. మహమ్మారిపై పోరాటం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. రోజువారీ కరోనా కేసులు మూడు రోజుల్లోనే రెండు లక్షలు దాటిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ ట్వీట్ చేశారు. ఆరోగ్య సంరక్షణలో పరిశోధనలు, ఆవిష్కరణలకు ప్రభుత్వ తోడ్పడుతుందని పునరుద్ఘాటించారు.
''మాస్కు ధరించడం, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకుంటూ ఇతర కరోనా నిబంధనలను అనుసరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనాపై యుద్ధం చేద్దాం. అదే సమయంలో ప్రపంచ మానవాళిని ఆరోగ్యంగా ఉంచేందుకు పగలు-రాత్రి అనే తేడా లేకుండా సేవలందిస్తోన్న వైద్య-ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. నిర్విరామంగా వీరు చేస్తోన్న కృషికి ప్రశంసలు తెలిపే రోజు ఈ రోజు.''
-ప్రధాని నరేంద్ర మోదీ
ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, పీఎం జన్ఔషధి యోజన వంటి అనేక పథకాలు చేపట్టిందని మోదీ తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.
ఏటా ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని డబ్ల్యూహెచ్‌ఓ నిర్వహిస్తోంది. కరోనా వైరస్ నిర్మూలనకు ప్రపంచ ప్రజలంతా ఉత్తమ ప్రయత్నాలు చేయాలనేది ఈ సంవత్సరం లక్ష్యం.
ఇవీ చదవండి: మాస్కులు, వెంటిలేషన్ ఉంటే చాలు!