Womens Reservation Bill 2023 : చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం లోక్‌సభలో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టినా.. అది కార్యరూపం దాల్చాలంటే ఎన్నో అడ్డంకులు దాటాల్సి ఉంది. ఇది రాజ్యాంగ సవరణ బిల్లు కాబట్టి పార్లమెంట్ ఉభయ సభలతో పాటు దేశవ్యాప్తంగా సగం రాష్ట్రాలు ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయ్యాకే చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని బిల్లులో పొందుపరిచారు.
2002లో ఆర్టికల్ 82కు చేసిన సవరణ ప్రకారం 2026 తర్వాత చేపట్టే తొలి జనగణన ఆధారంగానే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అలా అయితే 2031లోనే జనగణన ఉంటుంది. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణను కొవిడ్ కారణంగా కేంద్రం వాయిదా వేసింది. ఇది ఎప్పుడు నిర్వహిస్తారో ఇంకా తెలియదు. 2026 తర్వాతే దీన్ని చేపట్టి నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణను చేపట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2027 కల్లా చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు సాకారం అవుతాయని ప్రధాని మోదీ వెల్లడించారు. అలా జరిగితే 2027 నుంచి జరిగే అసెంబ్లీ ఎన్నికలు, 2029 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేసే వీలు ఉంటుంది.
Womens Reservation Bill History : 2011లో ఫిబ్రవరి-మార్చిలో జనగణన చేపట్టిన కేంద్రం అదే ఏడాది మార్చి 31న ఆ గణాంకాలను విడుదల చేసింది. 2027లో ఆ ప్రక్రియ చేపడితే నెలల వ్యవధిలోనే అది పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ బిల్లు ప్రకారం చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు 15 ఏళ్లు మాత్రమే అమల్లో ఉంటాయి. అవసరం అనుకుంటే ఆ తర్వాత కూడా వీటిని పొడిగించే అవకాశం పార్లమెంట్‌కు ఉంటుంది.
పంచాయతీ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలవుతూ వారు ఎన్నికవుతున్నా అధికారం మాత్రం వారి భర్తల చేతిలోనే ఉంటోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాజకీయ నాయకుల కుటుంబాల నుంచే మహిళలు ఎన్నికల్లో నిలబడితే మహిళల అభ్యున్నతి కోసం తెచ్చిన ఈ చట్టం ఉద్దేశ్యం నెరవేరదని ప్రముఖ న్యాయవాది శిల్పి జైన్ అన్నారు. రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి వచ్చే మహిళలను ఎన్నికల్లో పోటీకి ప్రోత్సహించే నిబంధన లేకపోతే మహిళా రిజర్వేషన్ వల్ల ప్రయోజనం దెబ్బతింటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
Women Reservation Bill 2023 Today in Lok Sabha : లోక్‌సభ ముందుకు మహిళా బిల్లు.. ఆమోదం ఎప్పుడంటే..