ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలు వచ్చే ఏడాది (UP Election 2022) ఉన్న నేపథ్యంలో రాజకీయ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదేసమయంలో ప్రజలు సైతం తమ సమస్యలను ప్రస్తావిస్తూ నేతలను నిలదీస్తున్నారు. ఇలాంటి ఘటనే బస్తీ జిల్లాలోని కుద్రాహా బ్లాక్‌లో జరిగింది. ఓ మహిళ సిట్టింగ్ ఎమ్మెల్యేకు (BJP MLA in UP) తీవ్ర స్థాయి హెచ్చరికలు చేశారు. తమ గ్రామానికి రోడ్డు వేయకపోతే చెప్పులతో కొడతామని బహిరంగంగా హెచ్చరించారు.
మహదేవ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా ఎమ్మెల్యే రవి సోంకర్‌కు (Ravi sonkar MLA) వ్యతిరేకంగా పలువురు మహిళలు నిరసన చేపట్టారు. చెప్పులు చేతిలో పట్టుకొని ఎమ్మెల్యేకు హెచ్చరికలు చేశారు. తక్షణమే తమ గ్రామంలో రోడ్డు నిర్మాణం ప్రారంభించకపోతే.. ఎమ్మెల్యేకు చెప్పులతో స్వాగతం పలుకుతామని శకుంతలా దేవి అనే మహిళ అన్నారు.
"అభివృద్ధి అనేది కాగితాలకే పరిమితం కాకూడదు. ఈ గ్రామంలో వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావాలి. లేదంటే ఎమ్మెల్యే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోడ్లు లేకపోవడం వల్ల చాలా మందికి వివాహాలు కూడా కావడం లేదు. ఇక్కడి ప్రజలే రవి సోంకర్‌కు ఓట్లేసి అసెంబ్లీకి పంపించారు. కానీ ఐదేళ్లలో ఈ గ్రామ ప్రజల కోసం ఎమ్మెల్యే రోడ్డు వేయించలేకపోయారు. కాబట్టి ఆయనకు ఓట్లు అడిగే హక్కు లేదు. వెంటనే రోడ్డు వేయించకపోతే ఎమ్మెల్యేకు చెప్పులతో స్వాగతం పలుకుతాం. చెప్పులతోనే కొట్టి చంపేస్తాం!'"
-శకుంతలా దేవి
శకుంతలా దేవి బహిరంగంగా హెచ్చరికలు జారీ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. శకుంతల.. ఒకప్పుడు భాజపా తరపున పనిచేసినవారే. భాజపా మహిళా మోర్చా విభాగానికి మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. ఎమ్మెల్యే రవి సోంకర్‌తో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు.
ఇదీ చదవండి: 'మోదీజీ.. చైనాకు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను వెనక్కి తీసుకోండి'