Women Reservation Bill Impact in AP Parliament and Assembly Constituencies: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడంతో.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికప్పుడు కాకుండా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత.. అంటే 2029 సార్వత్రిక ఎన్నికల నాటికే ఇది అమల్లోకి వస్తుందనే స్పష్టత వచ్చింది అయినప్పటికీ రాష్ట్రంలోని ఏయే నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉందనేదానిపై ప్రజాప్రతినిధులు ఆరా తీస్తున్నారు. ఈ బిల్లు వల్ల తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మహిళలకు కేటాయించే అవకాశం ఉందా.. అనే అంశంపై చర్చల్లో మునిగి తేలుతున్నారు. ఓటర్ల జాబితాలు దగ్గర పెట్టుకుని మరి వాటిని పరిశీలిస్తున్నారు.
2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల నాటికే ఈ బిల్లు అమల్లోకి వస్తుందని మొదట్లో ప్రచారం జరిగింది. దీంతో ఆ మార్పులు ప్రభావం, పర్యవసానం తమపై ఎలా ఉంటుందోనని తొలుత కొంతమంది ఆందోళన చెందారు. అయితే లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఇది అమల్లోకి వస్తుందనే స్పష్టత రావటంతో ఊరట పొందారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల జాబితాను ఈటీవీ భారత్ విశ్లేషించాయి.
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం ఎప్పుడో..?
ఈ ఏడాది జనవరి 5వ తేదీ నాటికి ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగకుండా.. నియోజకవర్గ పరిధిల్లో పెద్దగా మార్పులు.. చేర్పులు లేకపోతే మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పెద్ద తేడా ఏమీ ఉండకపోవొచ్చు. నియోజకవర్గాల సంఖ్య పెరిగి వాటి పరిధిల్లో భారీగా మార్పులు, చేర్పులు చేసుకుంటే మాత్రం.. మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల ముఖచిత్రం కూడా మారే వీలుంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో శాసనసభ నియోజకవర్గాల పెంపు అంశం ఉండటంతో పునర్విభజన సమయంలో ఇక్కడి నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 25 లోక్‌సభ నియోజకవర్గాలున్నాయి. వాటి సంఖ్య పెరగకుండా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే.. 8 స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. పునర్విభజనలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే.. ఈ సంఖ్య కూడా ఆ మేరకు పెరుగుతుంది. ప్రస్తుతమున్న స్థానాలనే పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న టాప్-8 నియోజకవర్గాలు మహిళలకు కేటాయించే వాటి జాబితాలో ఉండొచ్చు. ఆ లెక్కన విశాఖపట్నం, గుంటూరు, నరసరావుపేట, నెల్లూరు, తిరుపతి (S.C.), అనంతపురం, నంద్యాల, విజయవాడ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వేషన్ అయ్యే అవకాశం ఉంది.
Prathidhwani : మహిళా బిల్లు.. చట్టంగా మారేనా..?
రాష్ట్రంలో ప్రస్తుతం 175 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఈ సంఖ్య పెరగకుండా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే 58 స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న టాప్-58 శాసనసభ నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉండొచ్చు. విశాఖ పరిధిలోని భీమిలి, గాజువాక, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం తూర్పు, విజయవాడ పరిధిలోని విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, విజయవాడ పశ్చిమం, గన్నవరం, పెనమలూరు, గుంటూరు పరిధిలోని గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, మంగళగిరి, తిరుపతి, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం గ్రామీణం, కాకినాడ సిటీ, కాకినాడ గ్రామీణం తదితర నియోజకవర్గాలే ఎక్కువగా ఈ జాబితాలో ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం అర్బన్, కడప, భీమవరం తదితర జిల్లా కేంద్రాల పరిధిలోని నియోజకవర్గాలూ ఈ జాబితాలో ఉన్నాయి.