Woman Geologist Found Murdered : కర్ణాటకలో ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇంట్లోనే హత్యకు గురవడం సంచలనం రేపింది. భూగర్భ గనుల శాఖలో సీనియర్ జియాలజిస్ట్‌గా పని చేస్తున్న 43 ఏళ్ల ప్రతిమ.. బెంగళూరులోని తన ఇంట్లో శవమై కనిపించారు. ఈ హత్యపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
ఇదీ జరిగింది
సుబ్రమణ్యపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డకల్లసంద్రకు చెందిన కేఎస్ ప్రతిమ.. భూగర్భ గనుల శాఖలో సీనియర్ జియాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. కొంతకాలం క్రితమే ప్రతిమ దంపతులు విడిపోగా.. ఆమె భర్త, పిల్లలు శివమొగ్గలో ఉంటున్నారు. అయితే, రోజులాగే శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత నుంచి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ప్రతిమ స్పందించలేదు. అనుమానం వచ్చిన ప్రతిమ సోదరుడు ఆదివారం ఉదయాన్నే ఆమె ఇంటికి వెళ్లి చూడగా శవమై కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.
"దర్యాప్తు కోసం మూడు బృందాలను ఏర్పాటు చేశాం. హత్యకు గల కారణాల కోసం అన్వేషిస్తున్నాం. ఆమె గొంతు నులిమి, కోసి హత్య చేశారు. ఇంట్లో నగదు, ఆభరణాలు, విలువైన వస్తువుల దొంగతనం కూడా జరగలేదు."
--రాహుల్ కుమార్, బెంగళూరు దక్షిణ మండల డీసీపీ
పోలీసుల కాల్పుల్లో వేటగాడు మృతి
అటవీ అధికారులు జరిపిన కాల్పుల్లో ఓ వేటగాడు మరణించాడు. ఈ కర్ణాటకలోని బందీపుర టైగర్ రిజర్వ్‌లోని మద్దూర్‌లో జరిగింది. ఘటనా స్థలంలో ఓ తుపాకీతో పాటు జింక శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఆదివారం తెల్లవారుజామున అడవిలోకి సుమారు 10 మందితో కూడిన ఓ ముఠా.. వేటకు వచ్చింది. ఈ క్రమంలోనే వారి తుపాకీల శబ్దం విన్న అటవీ అధికారులు.. ఘటనా స్థలికి వెళ్లారు. అధికారులను చూసిన వేటగాళ్లు వారిపై కాల్పులకు దిగారు. అప్రమత్తమైన అటవీ అధికారులు.. వేటగాళ్లపై తిరిగి ఎదురు కాల్పులు చేశారు. దీంతో ఒకరు మరణించగా.. మిగిలిన ముఠా సభ్యులు తప్పించుకోపోయారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఎన్నికల వేళ మావోయిస్టుల దారుణం- ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేత హత్య