రెండు రోజుల్లో పెళ్లి. వివాహానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బంధువులు, స్నేహితుల మధ్య హల్దీ వేడుక సైతం ఘనంగా జరిగింది. కానీ ఇంతలోనే స్నానం కోసం బాత్రూంకు వెళ్లిన వధువు.. శవమై కనిపించింది. ఈ విషాద ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఆదివారం జరిగింది.
అప్పటి వరకు ఆనందంగా..
అహ్మదాబాద్‌కు చెందిన మున్నీ దేవి కూతురు గీతా.. ముజఫర్‌నగర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమెకు ఈనెల 7న బులంద్‌శహర్‌కు చెందిన సుమిత్తో వివాహం నిశ్చయించారు. ఈ క్రమంలోనే పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆదివారం హల్దీ వేడుక సందర్భంగా గీతకు పసుపు పూశారు. అనంతరం స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లింది గీత.
సుమారు 45 నిమిషాలు దాటినా రాకపోవడం వల్ల.. కుటుంబసభ్యులు తలుపు కొట్టి పిలిచారు. లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల అనుమానించిన కుటుంబ సభ్యులు.. బాత్రూం తలుపులు పగులగొట్టి చూడగా అపస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు.. ఆస్పత్రికి తరలించారు. గీతను పరీక్షించిన వైద్యులు.. ఆమె మరణించినట్లుగా ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్పారు.
ఇవీ చదవండి : కుమార్తె మృతి.. మృతదేహంతో రెండు రోజులు ఇంటింటికీ తిరిగిన తల్లి
60 చదరపు అడుగుల దుకాణం ఖరీదు రూ.1.72కోట్లు.. అంత ధర ఎందుకంటే..