Woman Burns Daughters Alive : బిహార్‌లోని నవాదా జిల్లాలో ఓ మహిళ.. రెండు, ఎనిమిదేళ్ల వయసున్న తన ఇద్దరు కుమార్తెలను సజీవ దహనం చేసింది. అనంతరం తాను కూడా నిప్పు అంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నమ్దర్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన కుటుంబంతో నివసిస్తోంది. ఆమెకు 2, 8 ఏళ్ల వయసు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గ్యాస్ సిలిండర్‌ను.. స్టవ్ నుంచి వేరు చేసి.. మరొక గదిలోకి తీసుకెళ్లింది. అనంతరం తన ఇద్దరు కుమార్తెలకు నిప్పంటించింది. అనంతరం తాను కూడా నిప్పుపెట్టుకుంది. ఇంటిలోంచి ఎగసిపడుతున్న మంటలను గమనించిన స్థానికులు.. షాట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగిందని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు అసలు విషయం తెలిసింది.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్డీపీఓ పంకజ్ కుమార్ స్పందించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ మహిళే తన ఇద్దరు కుమార్తెలకు నిప్పు అంటించిందని తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి అసలు కారణం ఇంకా తెలియలేదని.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత విషయం తెలుస్తుందని చెప్పారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
7 నెలల పసికందును బావిలో పడేసిన తల్లి..
ఝార్ఖండ్‌లోని గిరిడి జిల్లాలో ఓ కన్న తల్లి ఏడు నెలల చిన్నారిని బావిలో పడేసింది. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గవాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెరాయ్ ప్రాంతానికి చెందిన అనుజ్ యాదవ్ దిల్లీలో పనిచేస్తున్నాడు. అతడికి భార్య పాపలా దేవి, ఏడు నెలల కుమార్తె ఉన్నారు. కొద్ది రోజుల క్రితం అనూజ్ తల్లి చనిపోయింది. దీంతో నిందితురాలు తన ఏడు నెలల చిన్నారితో ఇంట్లో ఉంటోంది. బుధవారం ఒంటరిగా ఇంటివైపు వస్తున్న పాపలా దేవిని.. గమనించిన స్థానికుడొకరు.. 'నీ కుమార్తె ఏది' అని అడిగాడు. దీనికి.. బావిలో పడేసినట్లు చెప్పింది నిందుతురాలు. దీంతో స్థానికులు ఆ మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసున్నారు. గ్రామస్థుల సహాయంతో చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ సంజయన్ రాణా తెలిపారు.
పిడుగుపాటుకు ఏడుగురు బలి..
బంగాల్లోని మాల్దా జిల్లాలో పిడుగుపాటుకు గురై ముగ్గురు చిన్నారులు సహా ఏడుగురు మృతిచెందారు. 9 పశువులు కూడా చనిపోయినట్లు గురువారం అధికారులు తెలిపారు. మృతులను కృష్ణో చౌదరి (65), ఉమ్మి కుల్సుం (6), దెబొశ్రీ మండల్ (27), సోమిత్ మండల్ (10), నజ్రుల్ ఎస్కే (32), రోబిజాన్ బీబీ (54), ఏసా సర్కార్ (8)గా గుర్తించారు. ఓల్డ్ మాల్దాలో ఒకరు చనిపోగా.. కాలియాచక్ ప్రాంతలో మిగతా వారు మృతిచెందినట్లు డీఎమ్ తెలిపారు. ఈ మేరకు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా వివరాలు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించామని తెలిపారు.
మండుతున్న ఎండలు.. నలుగురు మృతి..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ జిల్లాలో వడదెబ్బతో నలుగురు మృతిచెందారు. ఈ మేరకు గోరఖ్‌పుర్ జిల్లా ఆస్పత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ఠకూర్ మరణాలను ధ్రువీకరించారు. ఎండ తీవ్రత పెరుగుతండటం వల్ల.. రోగుల సంఖ్య ఎక్కువ అవుతుందని ఆస్పత్రుల్లో బెడ్లు కూడా పెంచామని తెలిపారు. ఇక, ఎండల తీవ్రత కారణంగా సీహెచ్‌సీ (కమ్యూనిటీ హెల్త్ సెంటర్), పీహెచ్సీ (ప్రైమరీ హెల్త్ సెంటర్)లలో సౌకర్యాలు పెంచామని.. వడదెబ్బ బాధితులకు చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని సీఎమ్ఓ డాక్టర్ అశుతోశ్ కుమార్ దుబే తెలిపారు. ప్రజల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.