"అద్భుతాలు, ఆశ్చర్యాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం. ఇప్పుడు కాకపోతే మార్పు మరెప్పటికీ జరగదు."
- రజనీకాంత్, సినీ నటుడు
2020 డిసెంబర్ 3న తలైవా చెప్పిన ఈ మాటలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. '2021 జనవరిలో రజనీకాంత్ రాజకీయ ప్రవేశం'పై రకరకాల ఊహాగానాలు, విశ్లేషణలు వెల్లువెత్తాయి. 'తలైవా రాజకీయం' కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సూపర్‌స్టార్ అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
కానీ నెల రోజులు గడవకముందే మొత్తం తారుమారైంది. రజనీ నేడు చేసిన సంచలన ప్రకటన అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
"నూతన పార్టీ ఆలోచనను విరమించా. ఆరోగ్యం ప్రాధాన్యమని ఆత్మీయులు సూచించారు. అనారోగ్యం పార్టీ ఆలోచనను వెనక్కి నెట్టింది. నిజం మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడను. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజాసేవ నిరంతరం సాగుతోంది. నా నిర్ణయం అభిమానులను బాధపెట్టొచ్చు.. నన్ను క్షమించాలి. ప్రస్తుతం అనారోగ్యం.. దేవుడి చేసిన హెచ్చరికగా భావిస్తున్నాను.
- రజనీకాంత్, సినీనటుడు
'మార్పు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు' అన్న సూపర్‌స్టార్.. అనూహ్యంగా వెనకడుగు వేయడానికి అసలు కారణాలేంటి? రాజకీయాల జోలికి పోవద్దని కుమార్తెలు చెప్పిన మాటలు ఆయన మనసు మార్చుకునేలా చేశాయా? వాటితో పాటు ఎన్నికలకు పట్టుమని 6 నెలల సమయం లేకపోవడం.. క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యే పరిస్థితులు కనపడకపోవడం కూడా రజనీ వెనక్కి తగ్గడానికి కారణాలా?
'మనకొద్దు పప్పా..'
'రాజకీయాలు మనకొద్దు పప్పా.. ఇక ఆ పనులను వదులుకోండి' అని సినీ నటుడు రజనీకాంత్ కుమార్తెలు ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటీవల రజనీ ఆసుపత్రి నుంచి వచ్చిన తర్వాత ఆయన కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య తలైవాతో రాజకీయాలపై మాట్లాడారట. రాజకీయాలు, పార్టీ పనులు అంటూ నిత్యం ఆలోచనలో ఉంటున్న కారణంగానే మానసిక ఒత్తిడి పెరుగుతోందని, ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారని ఆయన కుటుంబసన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
సమయం లేదు..
2021 అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా చూస్తే 6 నెలల సమయం కూడా లేదు. రజనీ ఇంకా పార్టీ వివరాలే వెల్లడించలేదు. క్షేత్రస్థాయి వరకు పార్టీ చేరాలంటే దాని వెనుక బలమైన ప్రణాళిక, ముందుచూపు ఉండాలన్నది విశ్లేషకుల మాట. మరోవైపు నటుడు కమల్‌హాసన్ ఇప్పటికే పార్టీ పనుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేస్తున్నారు. ఇవన్నీ ఆలోచించిన సుపర్‌స్టార్.. రాజకీయరంగ ప్రవేశంపై వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.
"పార్టీ ప్రారంభించినా కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే గెలవలేను. ప్రజలు ఆశించేస్థాయిలో రాజకీయ తిరుగుబాటు సృష్టించలేను. రాజకీయ అనుభవమున్న ఎవరైనా ఈ వాస్తవాన్ని అంగీకరిస్తారు."
- రజనీకాంత్, సినీనటుడు
ప్రజాకర్షణ సరిపోదా?
'తలైవా పార్టీ ప్రకటిస్తే చాలు.. మిగిలింది మేం చూసుకుంటాం' అని అభిమానులు అంటున్నారు. సూపర్‌స్టార్‌కు ఉన్న బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌పై ఎవరికీ ఎలాంటి అనుమానం లేదు. ఆయనకున్న ప్రజాకర్షణకు సాటిలేదు. అయితే ప్రజాకర్షణ.. ఓట్ల రూపంలో మారుతుందా? అన్నదే ఇక్కడ ప్రశ్న. తమిళ రాజకీయం మొత్తం సినిమా చుట్టూనే తిరిగింది.. తిరుగుతుంది అనేది వాస్తవం. ఎంజీఆర్, కరుణానిధి నుంచి జయలలిత వరకు అందరిదీ సినీ నేపథ్యమే. అయితే వారంతా చాలా ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారు.. అందుకోసం పనిచేశారు. అయితే రజనీకి ప్రస్తుతం అంత సమయం లేకపోవడమే అసలు సమస్య.
పూర్తిస్థాయి కసరత్తు, పక్కా ప్రణాళికతోనే బరిలోకి రావాలనుకున్నా... ఆరోగ్య సమస్యలు వెనక్కి నెట్టాయని రజనీకాంత్ సైతం ఒప్పుకున్నారు.