234... తమిళనాడులోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య. చెన్నై పీఠం ఎవరిదో తేల్చడంలో ప్రతి స్థానమూ కీలకమే. కానీ... ప్రజల దృష్టిని ఆకర్షించేది మాత్రం ప్రముఖులు బరిలో నిలిచిన కొద్ది సీట్లే. ప్రజల్లోని ఈ ఆసక్తికి తగ్గట్టుగానే ప్రముఖులు కూడా అతి జాగ్రత్తగా వ్యవహరిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా.. ఏ స్థానం నుంచి పోటీ చేయాలి? అన్న విషయంపై ఎన్నో ప్రణాళికలు రచిస్తారు. తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఆనాటి దిగ్గజ నేతల నుంచి ఈరోజు ఉన్న పలువురు ప్రముఖల నియోజకవర్గాల కసరత్తుల గురించి తెలుసుకుందాం.
పక్కా ప్రణాళిక
అన్నాడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత.. తన రాజకీయ ప్రస్థానంలో అనేక నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. బోడినాయకనౌర్ నుంచి చెన్నైలోని ఆర్కే నగర్ వరకు ఎన్నో సీట్లలో బరిలో దిగారు. అయితే ప్రతి దాని వెనుక ఓ వ్యూహం ఉండేది. పక్కా ప్రణాళిక ఉండేది. అన్నింటినీ లెక్కేసి.. కచ్చితంగా గెలుస్తాననే ధీమా వచ్చినప్పుడే ఆమె ఆ నియోజకవర్గాన్ని ఎంచుకునే వారు.
డీఎంకే అధినేత కరుణానిధిది కూడా ఇదే కథ. పోటీ చేసిన ప్రతి ఎన్నికలో గెలుపొందిన ఘనత దివంగత నేత సొంతం. హార్బర్, సైదపేట్, అన్నా నగర్, చెపాక్, కులిథలై నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేశారు. ఇక్కడ కూడా పక్కా ప్రణాళిక ఉండేది.
ఆనాటి నేతలనే ఈనాటి ప్రముఖ నాయకులు కూడా అనుసరిస్తున్నారు. ఒక నియోజకవర్గాన్ని ఎంచుకునే ముందు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. విజయావకాశాలు ఎక్కువగా ఉన్న సీట్లనే ఎంచుకుంటున్నారు.
ఇదీ చూడండి:- తమిళనాట వాళ్లు లేకపోయినా వాడీవే'ఢీ'!
కమల్ హాసన్
మక్కల్ నీధి మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ పార్టీని ప్రకటించినప్పటి నుంచి.. ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే అంశంపై విపరీతంగా చర్చ జరిగింది. ఆయన చెన్నె నుంచే బరిలో దిగుతారని ఊహాగానాలు జోరుగా వినిపించాయి. అనంతరం.. సొంత ఊరు పరమకుడి నుంచే ఎన్నికల్లో నిలబడతారని అనేకమంది అంచనా వేశారు.
వాటికి చెక్ పెడుతూ.. దక్షిణ కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు కమల్. ఇక్కడ ఆయన ప్రధాన ప్రత్యర్థి.. భాజపా నేత వనతి శ్రీనివాసన్.
కొంగు మండలంగా పిలిచే ఈ ప్రాంతంలో ఎన్నో నగరాలు ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కమల్ పార్టీకి ఇక్కడ లక్షకు పైగా ఓట్లు దక్కాయి. గ్రామీణ ప్రాంతాల్లో కన్నా నగరాల్లో పార్టీకి ఎక్కువ ఆదరణ ఉండటం కమల్ నిర్ణయానికి కారణం.
దినకరన్
ఏఎమ్ఎమ్కే నేత దినకరన్.. చెన్నై ఆర్కే నగర్ నుంచి కోవిల్పట్టికి తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుకుడి సీటు(కోవిల్పట్టి ఉన్న ప్రాంతం) నుంచే ఆయన పార్టీ 8 శాతం ఓట్లు దక్కించుకుంది. డీఎంకే-అన్నాడీఎంకేకు షాక్ ఇస్తూ.. స్థానిక ఎన్నికల్లోనూ సత్తా చాటింది. పార్టీ మద్దతుదారుడు మాణిక్‌రాజ్ కారణంగా ఈ విజయాలను అందుకుంది.
వీటన్నింటినీ లెక్కలోకి తీసుకునే.. ధైర్యం చేసి కోవిల్పట్టి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు దినకరన్.
ఉదయనిధి స్టాలిన్
డీఎంకే అధినేత స్టాలిన్ వారసుడిగా.. ఉదయనిధి స్టాలిన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన చెపాక్- ట్రిప్లికేన్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కరుణానిధి.. ఇక్కడి నుంచే మూడుసార్లు గెలుపొందారు. మైనారిటీల ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి.
కరుణానిధి స్వస్థలం తిరువారూర్ నుంచి ఉదయనిధి పోటీ చేస్తారని.. థౌజెండ్ లైట్స్ నుంచి బరిలో దిగుతారని అనేక ఉహాగానాలు వచ్చాయి. చివరకు చెపాక్నే ఎంచుకున్నారు ఆయన.
ఇదీ చూడండి:- తమిళనాట మరోసారి సంస్కృత పేర్లపై వివాదం!
సీమన్
ఎన్టీకే అధినేత సీమన్.. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతున్నారు. ఇందుకోసం ఆయన తిరువోట్రియూర్ను ఎంచుకున్నారు. అక్కడి యువత, మత్స్యకారుల నుంచి పార్టీకి బలమైన మద్దతు లభిస్తుందన్న ధీమాతో ఈ నిర్ణయం తీసుకున్నారు సీమన్.
సీమన్ తొలుత.. స్టాలిన్‌కు పోటీగా కోలథర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ చివరకు తిరువోట్రియూర్ను ఎంచుకున్నారు.
ప్రేమలత
డీఎమ్‌డీకే నేత విజయకాంత్ సతీమణి ప్రేమలత.. విరుధాచలం నుంచి ఈసారీ ఎన్నికల బరిలో నిలిచారు. 2006లో తన భర్తకు అక్కడ భారీ స్థాయిలో మద్దతు లభించడమే ఇందుకు కారణం.
ఖుష్బూ
ప్రముఖ నటి, భాజపా నేత ఖుష్బూ.. చెన్నైలోని థౌజెండ్ లైట్స్ నుంచి పోటీ చేస్తున్నారు. వాస్తవానికి.. చెపాక్ నుంచి బరిలో దిగాలని ఖుష్బూ భావించారు. కానీ అన్నాడీఎంకే-భాజపా మైత్రిలో భాగంగా ఆ స్థానం ఆ పార్టీకి చేరింది. ఈ క్రమంలో థౌజెండ్ లైట్స్ వాసులను ఆకర్షించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు ఖుష్బూ.
మద్దతు లభిస్తుందా?
"సొంత వర్గం నుంచి మద్దతు, గత ఎన్నికల్లో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖులు వారి నియోజకవర్గాలను ఎంచుకుంటారు. అయితే ఖుష్బూ మాత్రం వీటికి అతీతంగా వెళ్లారు. నగరవాసులను ఆకర్షించేందుకు ఆమెకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చెన్నై తప్ప ఆమె ఇంకెక్కడా పోటీ చేయలేరు. అదే విధంగా.. కమల్ హాసన్ కూడా దక్షిణ కోయంబత్తూర్ నుంచి బరిలో దిగుతున్నారు. అక్కడ ఉన్న కేరళవాసుల నుంచి మద్దతు పొందాలని చూస్తున్నారు. సొంత వర్గానికి చెందిన ప్రజల నుంచి మద్దతు వస్తుందనే ధీమాతో దినకరన్ కోవిల్పట్టికి వెళ్లారు. ఇక విజయకాంత్‌కు దక్కిన విజయాన్ని చూసి ప్రేమలత ముందుకు సాగుతున్నారు. ఇలా ప్రతి ఒక్క అభ్యర్థి.. పూర్తిగా విశ్లేషించి, ప్రణాళికలు రచించిన తర్వాతే నియోజకవర్గాన్ని ఎంచుకుంటారు."
--- తిరునవుక్కరాసు, రాజకీయ పరిశీలకులు, హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ.
విజయం దక్కేనా?
ఎన్ని ప్రణాళికలు రచించినా, ఎంత జాగ్రత్తగా నియోజకవర్గాలను ఎంచుకున్నా.. ప్రముఖులు ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తమిళనాడులో ఇది ఇంకా ఎక్కువ. కామరాజ్, అన్నాదురై, జయలలిత, విజయకాంత్, స్టాలిన్, శివాజీ గణేశన్ వంటి వారు ఒకానొక సమయంలో ఘోరంగా ఓడిపోయిన వారే.
వీటన్నింటినీ చూస్తే.. ఎవరు ఎన్ని ప్రణాళికలు రచించినా, ఎవరికి ఎంత పేరు ఉన్నా... చివరికు వారి భవితవ్యాన్ని తేల్చేది ప్రజలే అని స్పష్టంగా అర్థమవుతుంది.
ఇదీ చూడండి:- తమిళనాట మరోసారి సంస్కృత పేర్లపై వివాదం!