రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాక దిల్లీలో పరివర్తన్ (మార్పు) తెస్తామని బంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. గురువారం పలు ప్రచార సభల్లో పాల్గొన్న దీదీ.. భాజపాపై ధ్వజమెత్తారు. ఎన్నికలైన తర్వాత దిల్లీలో అడుగుపెడతామన్న భయం కాషాయంపార్టీలో నెలకొందని.. అందుకే పూర్తి బలగంతో తమపై ఆ పార్టీ దాడి చేస్తోందన్నారు.
అయినా భయపడేది లేదని.. బంగాల్ ఎన్నికలయ్యాక దిల్లీలో అడుగుపెడతామని , అక్కడ భాజపా భరతం పట్టడం ఖాయమని దీదీ స్పష్టం చేశారు. బంగాల్ ప్రజల ఓట్లను దోచుకోవడానికి హెలికాఫ్టర్లు, విమానాల్లో నోట్ల కట్టలను భాజపా దించుతోందని ఆరోపించారు. సీపీఎంకు ఓటు వేయొద్దని వామపక్ష మద్దతు దారులకు విజ్ఞప్తి చేశారు మమతా. ఎట్టిపరిస్థితుల్లోనూ జాతీయ జనాభా పట్టికను(ఎన్పీఆర్) అనుమతించే ప్రసక్తే లేదని దీదీ స్పష్టం చేశారు.
దిల్లీ సీఎంకు దీదీ లేఖ
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. లోక్‌సభలో నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ దిల్లీ(సవరణ) 2021 బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటానికి మద్దతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
ఇదీ చూడండి: అసోంలో రెబల్స్‌కు భాజపా షాక్