Wife Killed Husband : తమిళనాడులోని శివగంగైలో.. భర్తను భార్య చంపేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసింది. ఇంటి యజమాని సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేయిస్తుండగా.. అస్థిపంజరం బయటపడడం వల్ల అసలు విషయం 8 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవకొట్టై గంబర్ వీధిలో శరవణన్ అనే వ్యక్తి.. తన ఇంటి బయట ఉన్న సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేయించాడు. ఆ సమయంలో సెప్టిక్ ట్యాంక్‌లో నుంచి అస్థిపంజర భాగం, ఒక షర్ట్, ఒక గాజు ముక్క బయటపడ్డాయి. ఒక్కసారిగా వాటిని చూసి భయపడ్డ శరవణన్.. దేవకొట్టై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
"ఎనిమిదేళ్ల క్రితం.. నా ఇంట్లో పాండియన్ అనే వ్యక్తి కుటుంబంతో అద్దెకు దిగాడు. అతడికి భార్య సుగంతి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పాండియన్(44) బస్సు కండక్టర్‌గా పనిచేసేవాడు. అతడు తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. భార్యతో ఎప్పుడూ గొడవపడేవాడు. నాకు వారిపైనే అనుమానం ఉంది" అని ఇంటి యజమాని శరవణన్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సుగంతిని అదుపులో తీసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆమె నేరం అంగీకరించింది. 2014లో తన భర్త మద్యం తాగి ఇంటికి వచ్చినట్లు తెలిపింది. ఆ సమయంలో వాగ్వాదం జరగడం వల్ల హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడేసినట్లు చెప్పింది. అదే ఇంట్లో తాను ఆరు నెలలపాటు ఉన్నట్లు పేర్కొంది. ఆ తర్వాత వేరే ప్రాంతానికి వెళ్లిపోయినట్లు తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
అంతకుముందు.. 2014లోనే మరణించిన పాండియన్ తండ్రి తన కుమారుడి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో సుగంతి పోలీసులను విచారించారు. తన భర్త కోయబత్తూరులో ఉద్యోగం చేస్తున్నాడని.. అక్కడ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సుగంతి తెలిపింది. అప్పుడప్పుడు తనకు డబ్బులు పంపిస్తున్నాడని చెప్పింది. దీంతో పోలీసులు అప్పుడు విచారణను కొనసాగించలేదు. ఇప్పుడు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వల్ల మొత్తం బండారం బయటపడింది.