దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. కొవిడ్ పోరులో ముందుడి నడుస్తోన్న ఆరోగ్య సిబ్బంది తొలి ప్రాధాన్యంగా వారికి టీకా ఇస్తున్నారు. అయినప్పటికీ.. వారిలో ఇప్పటి వరకు కేవలం 66 శాతం మంది టీకా తీసుకున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే టీకా సామర్థ్యంపై వారిలో సంకోచమే అందుకు కారణమన్నారు భారత వైద్య సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి డా. ఆర్.వి అశోకన్.
"టీకా సమర్థతపై అనుమానంతో దానిని తీసుకోవడానికి సంకోచించడమే వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా జరగడానికి కారణం కావొచ్చు. ఆరోగ్య సిబ్బంది వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రధానంగా.. టీకాపై సంకోచం, అప నమ్మకం ప్రతిబంధకాలుగా ఉన్నాయి. వ్యాక్సిన్లకు ఆమోద ప్రక్రియ, కొందరికి టీకాలు అందుబాటులో లేకపోవడమూ కారణమే."
-డా. ఆర్.వి అశోకన్, భారత వైద్య సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి
ప్రాధాన్యత ఇచ్చినా..
వ్యాక్సినేషన్‌కు సంబంధించినంత వరకు ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ఎందుకంటే కొవిడ్ రోగుల సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో శ్రమించేది వారే. అయితే ఇప్పటివరకు కేవలం 1.64 కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది మాత్రమే టీకా తీసుకున్నారని కేంద్రం చెబుతోంది. వారిలో 67 లక్షల మంది మాత్రమే రెండు డోసులూ పొందగా, 97 లక్షల మంది తొలి డోసు వేయించుకున్నట్లు తెలిపింది.
వైద్యులే సంకోచించారు..
ఆరోగ్య సిబ్బంది, మరీ ముఖ్యంగా వైద్యులు వ్యాక్సిన్ సామర్థ్యాన్ని సంకోచించారని అన్నారు ఆరోగ్య నిపుణులు డా. సునీలా గార్గ్. "టీకా సమర్థతపై సమాచారం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రారంభ దశలో వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆరోగ్య కార్యకర్తలు వెనుకాడారు. అయితే ఇప్పుడు టీకా సామర్థ్యం నిరూపితమైంది. ఆరోగ్య సిబ్బందికి టీకాల కొరత సమస్య కాదు. ఎందుకంటే వారు ప్రాధాన్య జాబితాలో ఉన్నారు. సంకోచమే ప్రధాన కారణంగా కనబడుతోంది." అని గార్గ్ అన్నారు.
ఇదీ చూడండి: '2021 చివరికల్లా యువత మొత్తానికి టీకా'