కరోనా నియంత్రణకు 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్కులైన పిల్లలకు సైతం కొవాగ్జిన్ టీకా ఇచ్చేలా భారత్ బయోటెక్ సంస్థ తీవ్రంగా కృషిచేస్తోంది. క్లినికల్ పరీక్షల నిర్వహణకు ఇప్పటికే ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. అయితే, మరో 10 నుంచి 12 రోజుల్లో రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమవుతాయని నీతి ఆయోగ్ సీనియర్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్ వెల్లడించారు.
ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి పొందిన భారత్ బయోటెక్ సంస్థ.. ఈ టీకాను 525 మందిపై పరీక్షించనుంది. రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షల్లో ఆరోగ్యవంతులైన 525 మంది వలంటీర్లు పాల్గొంటారని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలే వెల్లడించింది. పిల్లలపై ఈ టీకా ఏమేరకు పనిచేస్తుందో తెలుసుకొనేందుకు వీలుగా క్లినికల్ పరీక్షలు నిర్వహించాలని భారత్ బయోటెక్ ప్రతిపాదించగా.. అందుకు భారత ఔషధ నియంత్రణ మండలి, దానికి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ అంగీకరించిన విషయం తెలిసిందే. ‘కొవాగ్జిన్’ టీకాను ఇప్పటికే 18 ఏళ్లు పైబడినవారికి పంపిణీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఆ స్ట్రెయిన్‌తో పిల్లలకు ముప్పు- విమానాలు ఆపండి'