క్రికెట్లో పరుగులు తీసేటప్పుడు బ్యాట్‌తో వేగంగా పరిగెత్తాలి. బంతిని పట్టుకునేందుకు జంపులూ చేయాలి. అయితే.. తమకు ఆ నైపుణ్యాలు లేకపోయినా.. క్రికెట్ ఆడటంలో తామేం తక్కువకాదని నిరూపిస్తున్నారు ఛత్తీస్‌గఢ్‌లోని దివ్యాంగ క్రికెటర్లు. చక్రాల కుర్చీల్లో కూర్చొనే.. బ్యాట్, బంతితో తలపడుతున్నారు.
కోర్బాలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా జరుగుతున్న వీల్‌ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ స్ఫూర్తిదాయకంగా సాగుతోంది. కోర్బా సహా రాయ్‌పుర్, జాంజ్‌గిర్ జిల్లాకు చెందిన దివ్యాంగ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌ల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బంతి, బ్యాట్‌తో సత్తా చాటుతూ.. తమ లాంటి వారెందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
మొదటిరోజు సత్తా చాటిన జట్లు
కోర్బాలోని ఎస్ఈసీఎల్ స్టేడియంలో శనివారం ఈ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు కోర్బా, జాంజ్‌గిర్ జట్లు ఈ మ్యాచ్‌లో తలపడ్డాయి. 10 ఓవర్లకు గాను జాంజ్‌గిర్ జట్టు 148 పరగులు చేసి, కోర్బా జట్టుకు లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం బరిలోకి దిగిన కోర్బా జట్టు చివరి బంతికి రెండు పరుగులు జోడించి, మ్యాచ్‌లో విజయం సాధించింది. ఇరు జిల్లాలకు చెందిన ఆటగాళ్లూ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించారు.
రూల్స్ ఏంటి?
ఈ వీల్‌ఛైర్ క్రికెట్.. మామూలు క్రికెట్‌లానే ఆడతారు కానీ.. దీనికంటూ కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు విధించుకున్నారు ఆటగాళ్లు. క్రికెట్ పిచ్ 22 గజాలు కాకుండా 18 గజాలు మాత్రమే ఉంటుంది. క్రికెట్ మైదానం బౌండరీ 55 మీటర్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఆటగాళ్ల సౌలభ్యం కోసమే ఈ చిన్నిపాటి మార్పులు.
ప్రోత్సాహం కరవు
ఈ మూడు జిల్లాల ఆటగాళ్లు పాల్గొంటున్న ఈ వీల్‌ఛైర్ క్రికెట్ టోర్నీని కోర్బా జిల్లా వెనుకబడిన తరగతుల సొసైటీ(డీబీసీఎస్) నిర్వహిస్తోంది. అయితే.. ఈ మ్యాచ్‌లకు ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందటం లేదని టోర్నీ నిర్వాహకులు వాపోతున్నారు.
"వీల్‌ఛైర్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మా వద్దకు వచ్చి ఈ మ్యాచ్‌లను నిర్వహించాలని కోరారు. అనంతరం మేము ప్రభుత్వ సాయం కోసం ప్రయత్నించాం. కానీ, మాకు ఎలాంటి సహకారం అందలేదు. ఆ తర్వాత మేం ఎస్ఈసీఎల్ జనరల్ మేనేజర్‌ను కలిస్తే ఆయన మాకు మైదానంతో పాటు, ఆటగాళ్లు ఉండేందుకు వసతి సౌకర్యాన్నీ కల్పించారు. దివ్యాంగులకు స్ఫూర్తి నింపేలా భవిష్యత్‌లో మేం మరిన్ని పోటీలను నిర్వహిస్తాం."
-గిరిధారి సాహు, డీబీసీఎస్ అధ్యక్షుడు
"మా వద్ద అత్యంత ప్రతిభావంతులైన జాతీయ ఆటగాళ్లు ఉన్నారు. కానీ, వారికి సహాయ సహకారాలే కరవయ్యాయి. దివ్యాంగులు తమ ఇంటి నుంచి మ్యాచ్‌లకు హాజరయ్యేందుకు వెళ్లడం చాలా సవాలుతో కూడుకున్న పని. మేం వారికి మా శక్తి మేర సాయపడుతున్నాం. ప్రభుత్వం ఏదైనా సాయం అందిస్తే వాళ్లు మరింత గొప్ప స్థాయిలో రాణిస్తారు."
-డాక్టర్ ఓం నేతమ్, ఛత్తీస్‌గఢ్ వీల్‌ఛైర్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు
ప్రభుత్వం తమను ప్రోత్సహిస్తే ఎన్నో విజయాలు సాధిస్తామని దివ్యాంగ ఆటగాళ్లు చెబుతున్నారు. ఇప్పటికైనా.. అధికారులు తమకోసం సాయం అందించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:అతివలకు ఆదర్శం- ట్రాక్టర్‌తో బతుకు పోరాటం