బంగాల్‌లో జాదవ్‌పుర్ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ) పరిధిలో తమ ఖాతాలో మిగిలి ఉన్న ఈ ఏకైక అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకునేందుకు వామపక్షాలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని సాధించేందుకు ఇక్కడి గెలుపును పునాదిగా చేసుకోవాలని తహతహలాడుతున్నాయి. అయితే.. ఈ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్, భాజపా కూడా గట్టి పోటీనే ఇస్తున్నాయి.
బుద్ధదేవ్.. వరుసగా ఐదుసార్లు
కోల్‌కతా దక్షిణ శివార్లలో జాదవ్‌పుర్ నియోజకవర్గం విస్తరించి ఉంది. అది దశాబ్దాలుగా కామ్రేడ్లకు కంచుకోట. 1967 నుంచీ అక్కడ సీపీఎందే విజయబావుటా. అందుకే దాన్ని 'లెనిన్ గ్రాడ్ ఆఫ్ కోల్‌కతా'గా పిలిచేవారు. మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం అగ్రనేత బుద్ధదేవ్ భట్టాచార్య ఈ స్థానంలో 1987 నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ అభ్యర్థి మనీష్ గుప్తా చేతిలో 16 వేలకు పైగా ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అయితే- వామపక్ష కంచుకోటను బద్దలుకొట్టిన ఆనందం తృణమూల్‌కు ఎక్కువ కాలం నిలవలేదు. 2016లో జాదవ్‌పుర్ మళ్లీ సీపీఎం ఖాతాలోకి వెళ్లింది. ఆ ఎన్నికల్లో కేఎంసీ పరిధిలో వామపక్షాలకు దక్కిన సీటు అదొక్కటే. దాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని ప్రస్తుతం గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే- 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ అసెంబ్లీ స్థానం పరిధిలో తమ అభ్యర్థిపై తృణమూల్ అభ్యర్థికి 12 వేలకుపైగా ఓట్ల ఆధిక్యం లభించడం కామ్రేడ్లను కలవరపెడుతోంది.
ముక్కోణపు పోటీ
ప్రస్తుతం జాదవ్‌పుర్‌లో సీపీఎం-కాంగ్రెస్-ఐఎస్‌ఎఫ్, తృణమూల్, భాజపాల మధ్య ముక్కోణపు పోరు నడుస్తోంది. సీపీఎం తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే సుజన్ చక్రవర్తి ప్రచారంలో ప్రధానంగా శాంతిభద్రతలు, నిరుద్యోగం వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. "జాదవ్‌పుర్ ప్రజలు రాజకీయపరంగా చైతన్యవంతులు. భాజపా, తృణమూల్ తమను ఎలా మోసం చేస్తున్నాయో అర్థం చేసుకోగలరు. మంచి భవిష్యత్తుకే ఈ దఫా వారు ఓటేస్తారు" అని సుజన్ పేర్కొన్నారు.
తృణమూల్ తరఫున బరిలోకి దిగిన దేవవ్రత మజుందార్.. 20 ఏళ్లపాటు కౌన్సిలర్‌గా ఉన్నారు. "జాదవ్‌పుర్ అభివృద్ధికి, సుందరీకరణకు నేను కౌన్సిలర్‌గా ఎంతో కృషి చేశా. సుజన్ పనితీరు బాగోలేదు. అందుకే గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సీటు పరిధిలో మా పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ దఫా విజయం మాదే" అని మజుందార్ పేర్కొన్నారు.
1947లో దేశ విభజన తర్వాత.. అప్పటి తూర్పు బంగాల్, తూర్పు పాకిస్థాన్‌ల నుంచి వచ్చి స్థిరపడిన ప్రజల వారసులు జాదవ్‌పుర్‌లో అధిక సంఖ్యలో ఉన్నారు. సీఏఏను అమలు చేసి, పౌరసత్వం మంజూరు చేస్తామంటూ హామీలు ఇవ్వడం ద్వారా వారిని ఆకర్షించేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. సీపీఎం నుంచి వచ్చిన రింకూ నస్కర్‌ను కమలదళం ఇక్కడ బరిలో దించింది. జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఈ దఫా ప్రజలు తనను గెలిపిస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:'కింగ్ మేకర్' ఆశలతో కూటమి అస్తిత్వ పోరు