బంగాల్లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది భారతీయ జనతా పార్టీ. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. మమతను గద్దె దించి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కీలక 109 స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ట్రబుల్ షూటర్స్‌గా భావించే.. 22 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు, కేంద్ర మంత్రులను రంగంలోకి దించింది. ఆ నియోజకవర్గాల ఎన్నికల బాధ్యతలను వారికి అప్పగించింది పార్టీ అధినాయకత్వం.
ఈ నేతలు తమకు కేటాయించిన నియోజకవర్గాల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అక్కడే ఉంటూ పార్టీ స్థానిక నాయకత్వానికి దిశా నిర్దేశం చేయనున్నారు.
ఎవరెవరికి.. ఏయే బాధ్యతలు?
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఉత్తర కోల్‌కతాలోని 9 నియోజక వర్గాల బాధ్యతలను అప్పిగించారు. ఖర్ధా, నార్త్ దమ్ దమ్, కామర్హటి, పానిహటి, బారానగర్, దమ్ దమ్, రాజర్ హట్ న్యూటౌన్, బిదానగర్, రాజర్హట్ గోపాల్ పుర్ నియోజకవర్గాల్లో ఎన్నికలను ఆయన పర్యవేక్షించనున్నారు.
హౌరా రూరల్‌లోని ఐదు అసెంబ్లీ నియోజక వర్గ బాధ్యతలను కేంద్ర మాజీ మంత్రి రాధామోహన్ సింగ్‌కు అప్పగించారు. బారక్‌పుర్‌లో ఉంటూ.. భట్పరా, నయహటి, నోపారా, బారక్‌పుర్ ఎన్నికలను కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పర్యవేక్షించనున్నారు.
బషీర్హట్లోని నాలుగు నియోజకవర్గాల ఎన్నికల బాధ్యతలను ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, ఎంపీ వినోద్ సోన్కర్ చూసుకోనున్నారు. బషీర్‌హట్, బరాసాట్ నియోజకవర్గాల్లో స్థానిక పార్టీ విభాగంతో కలిసి బిహార్ వైద్య ఆరోగ్య మంత్రి మంగళ్ పాండే పని చేయనున్నారు.
బంగాల్లో మమతా బెనర్జీ రెండో స్థానంగా పోటీ చేస్తున్న టోలీ గంజ్ బాధ్యతలను నితిన్ నాబిన్కు అప్పగించారు. కోల్‌కతా పోర్ట్, సహా భవానీ పుర్ బాధ్యతలను భాజపా ఎంపీ వినయ్ శశ్రబుద్ధే పర్యవేక్షించనున్నారు. వీరితో పాటు మొత్తం 22 మంది నాయకులను భాజపా అధినాయకత్వం బంగాల్‌కు పంపించింది.
కొత్త ఉత్సాహం..
బంగాల్లో 2016కు ముందు ఉనికే లేని భాజపా గత లోక్‌సభ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా పుంజుకొంది. 2019 సాధారణ ఎన్నికల్లో అక్కడి 42 లోక్‌సభ స్థానాలకు గానూ 18 చోట్ల విజయం సాధించింది. నాటి నుంచి అదే దూకుడుతో ప్రతి విషయంలో దీదీని ఢీ కొడుతోంది. ఆ ఎన్నికల్లో ఓట్ల శాతం భారీగా పెంచుకొని శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహం నింపింది.
అదే ఊపులో..
2016లో కేవలం 3 స్థానాలకే పరిమితమై 10.16 శాతం ఓట్లు సాధించిన భాజపా.. 2019 ఎన్నికలు వచ్చేసరికి అది 40.64శాతానికి పెరగడం కాషాయ దళంలో ఎనలేని ఆత్మవిశ్వాసం నింపింది. అదే ఊపులో ఈసారి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని మోదీ, అమిత్ షా నాయకత్వంలో భాజపా ముందుకెళ్తోంది. బంగాల్ని అభివృద్ధి బాటలో పయనించేలా చేస్తామని భారీ హామీలతో బెంగాలీలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అదేసమయంలో తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఈ నెల 27 నుంచి సుదీర్ఘంగా ఎనిమిది విడతల్లో బంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇవీ చూడండి: