కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటం ఎన్నిరోజులైనా ఆగదని స్పష్టం చేశారు అఖిల భారత కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాకేశ్ టికాయిత్. వచ్చే ఏడాది వర్షాకాలం, ఎండాకాలం పూర్తయినా.. నిరసనలను ఆపేది లేదని తేల్చి చెప్పారు.
కర్ణాటకలోని బెళగావిలో నిర్వహించిన రైతు మహాపంచాయత్‌లో పాల్గొన్నారు టికాయిత్.
"ఇకపై పోరాటం చేసేందుకు రైతులు దిల్లీ, బెంగళూరుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే మన వద్దకు వస్తుంది. ఉత్తర కర్ణటకలోని సువర్ణ సౌధకే కర్ణాటక ప్రభుత్వం రావాలి. నిరసనలు చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. 2021 ఏడాది నిరసనలు, పోరాటాలతో నిండింది. చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఈ పోరాటం ఆగదు. ప్రతి గ్రామం ఈ పోరాటానికి మద్దతుగా నిలిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం."
- రాకేశ్ టికాయిత్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు
దిల్లీ సరిహద్దుల్లో 125 రోజులుగా 20 వేల ట్రాక్టర్లలతో పోరాటం చేస్తున్నట్లు చెప్పారు అఖిల భారత కిసాన్ మోర్చా నేత యుద్ధవీర్ సింగ్. ఇప్పటికే 300 మందికిపైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవటం లేదన్నారు. రైతుల పంటను సాగు చట్టాల ద్వారా దోచుకునేందుకు మోదీ ప్రభుత్వం పక్కా ప్రణాళికను రచించిందని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'మే నెలలో పార్లమెంటుకు రైతుల పాదయాత్ర'