తాము ఆగస్టు నుంచి నెలకు కోటి టీకా డోసులు ఉత్పత్తి చేస్తామని జైకోవ్-డి వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన జైడస్ క్యాడిలా తెలిపింది. డిసెంబర్ నాటికి ఈ సంఖ్యను 5 కోట్లకు చేర్చుతామని తెలిపింది. ప్రపంచంలో కరోనావైరస్‌పై తొలి డీఎన్ఏ టీకా తమదేనని జైడస్ క్యాడిలా పేర్కొంది. ఈ టీకా తయారీ, వినియోగం అత్యంత సులువని చెప్పింది.
దీంతో భారత్‌లో వ్యాక్సినేషన్‌కు అదనపు శక్తి లభించనుంది. ఇప్పటికే దేశంలో కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాలను వినియోగిస్తున్నారు. కొత్తగా మోడెర్నా టీకాల దిగుమతికి పచ్చజెండా ఊపారు. హైదరాబాద్ సంస్థ బయోలాజికల్-ఇ టీకా కూడా వేగంగా పురోగతి సాధిస్తోంది. ఈ క్రమంలో జైడస్ టీకా జైకోవ్-డికు అత్యవసర వినియోగ అనుమతులను కోరింది. ఈ టీకాకు ప్రభుత్వం ఆమోద ముద్రవేస్తే ప్రతినెలా దాదాపు కోటి డోసులు అందుబాటులోకి వస్తాయి.
డీఎన్‌ఏ టీకా ఎలా పనిచేస్తుంది..
ప్రపంచంలో ఇప్పటి వరకు కొవిడ్ నివారణకు నాలుగు విధానాల్లో టీకాలు తయారు చేస్తున్నారు. అచేతన వైరస్, ప్రొటీన్ సబ్‌యూనిట్, వైరల్ వెక్టార్(డొప్పవంటివి), న్యూక్లియస్ యాసిడ్(డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ)లతో చేస్తున్నారు. ఇక జైడస్ తయారు చేసిన జైకోవ్-డి న్యూక్లియస్ యాసిడ్ కేటగిరిలోకి వస్తుంది. ఈ టీకాలో జన్యుపరమైన మార్పులు చేసిన 'ప్లాస్మిడ్ డీఎన్‌ఏ' ఉంటుంది.
బ్యాక్టిరియాల్లో అసలు డీఎన్‌ఏలతో పాటు అదనపు డీఎన్‌ఏలు కూడా ఉంటాయి. ఈ అదనపు డీఎన్‌ఏలను 'ప్లాస్మిడ్'గా పేర్కొంటారు. ఆ బ్యాక్టీరియా ఇవి లేకపోయినా అది జీవిస్తుంది. ఇది ఉండటం వల్ల బ్యాక్టీరియాలకు అదనపు సామర్థ్యాలు లభిస్తాయి. ఇవి గుండ్రంగా ఉంటాయి. ఇవి స్వయంగా పునరుత్పత్తి చేసుకొగలవు. వీటికి ప్రత్యేకమైన సాంకేతికతను వినియోగించి వైరస్ యాంటిజెన్ వలే వ్యహరించేట్లు జన్యుపరమైన మార్పులు చేశారు. ఇది శరీరంలోకి వెళ్లాక కరోనా చంపే యాంటీబాడీల తయారీని ప్రేరేపిస్తుంది. కాకపోతే ఈ టీకాలో పునరుత్పత్తి చేసుకోలేని ప్లాస్మిడ్‌ను వినియోగించారు. అదే ఫైజర్ వంటి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల్లో మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏను వాడారు. జైడస్ డీఎన్‌ఏను వినియోగించింది.
తయారీ అత్యంత సులువు..
ఈ టీకాల తయారీకి కనీసం బయోసేఫ్టీ లెవల్స్ ఉంటే సరిపోతుంది. భారీ ల్యాబ్‌లు అవసరంలేదు. బీఎస్‌ఎల్-1 స్థాయి ల్యాబ్‌లో కూడా చేయవచ్చు. దీనికి ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల వలే అత్యంత శీతల గిడ్డంగుల అవసరం కూడా లేదు. సాధారణ రిఫ్రిజిరేటర్‌లో కూడా భద్రపర్చవచ్చు. వైరస్ మ్యూటేట్ అయి లొంగని సమయంలో వెంటనే టీకాల్లో మార్పులు చేసుకొనే అవకాశం ఉంటుంది.
ఎన్ని డోసులు.. ఎప్పుడెప్పుడు..!
ఈ టీకాను మూడు డోసులు వేసుకొంటే దీర్ఘకాలం రోగనిరోధక శక్తి ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో రెండు డోసుల వ్యాక్సిన్లనే వాడుతున్నారు. జైడస్ కూడా రెండు డోసుల విధానంపై పరీక్షలు నిర్వహించింది. టైమ్స్‌ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఈ మూడు డోసులను 0-28-56 రోజులకు వేసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడానికి సూది అవసరం లేదని కంపెనీ చెబుతోంది. దీనిని చర్మం పొరల మధ్య ఇస్తారు. దీంతో నొప్పి, వాపు వంటి సైడ్‌ఎఫెక్ట్స్ ఉండవు. సూదికి భయపడేవారికి ఇది సంతోషకరమైన వార్త. ఇప్పటి వరకు భారత్‌లో ఇస్తున్న టీకాలను కండరాలకు ఇస్తున్నారు.
ఏటా 24 కోట్ల డోసుల తయారీకి సన్నాహాలు..
టీకాకు అనుమతులు వచ్చాక ఉత్పత్తిని ఏటా 24 కోట్ల డోసులుకు పెంచాలని జైడస్ భావిస్తున్నట్లు కంపెనీ ఎండీ డాక్టర్ షర్విల్ పటేల్ పేర్కొన్నారు. జూన్‌లో ఇందుకు అవసరమైన ముడిపదార్థాలను ప్లాంట్లకు సరఫరా చేయడం మొదలుపెట్టారు. తొలుత నెలకు కోటి డోసులను ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత దీనిని రెండు కోట్లకు పెంచనున్నారు. దీంతోపాటు ఇప్పటికే 12-17 ఏళ్ల వారిపై కూడా ప్రయోగ పరీక్షలు చేశారు. దీంతో ఈ టీకా పిల్లలు, కౌమారదశలోని వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇప్పటి వరకు తెలిసిన ప్రయోగ ఫలితాలు..
ఈ టీకా రోగలక్షణాలతో కొవిడ్ రాకుండా 66.6శాతం అడ్డుకొంటుందని కంపెనీ చెబుతోంది. అదే లక్షణాలు లేకుండా, మధ్యశ్రేణిలో కొవిడ్ వచ్చే అవకాశాన్ని100 శాతం అడ్డుకుంటోందని పేర్కొంది. మొత్తం 28,000 మందిపై ప్రయోగ పరీక్షలు చేశారు. పూర్తిడేటా వెలువడాల్సి ఉంది. "సెకండ్ వేవ్ సమయంలో ప్రయోగ పరీక్షలు చేయడంతో డెల్టావేరియంట్‌పై టీకా సామర్థ్యాన్ని కూడా తెలుసుకొన్నాము" అని జైడస్ స్టాక్ ఎక్స్‌ఛేంజికి తెలియజేసింది.
ఇదీ చూడండి: భారత్‌లో త్వరలో మరో టీకా- పిల్లలకు కూడా!