ఎవరో చెప్పడంవల్లే కొవాగ్జిన్ తయారీకి ఇప్పుడు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేయడంలో నిజం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పష్టంచేశారు. శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో దీనిపై మాట్లాడారు.
"...ఒప్పందాలు అలా జరగవు. సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం అలా బదిలీకాదు. ఒక వ్యాక్సిన్‌కు బీజం పడిననాటి నుంచి బయటకు రావడానికి 70-75 రోజులు పడుతుంది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి, దాని మార్గదర్శకత్వంలో, దాని మద్దతుతో మూడు ప్రభుత్వరంగ సంస్థలతో భారత్ బయోటెక్ భాగస్వామ్య ఒప్పందం చేసుకొంది. ఎన్నో నెలల నుంచి ఆ పని జరుగుతోంది. మా బృందాలు వెళ్లి అక్కడ పరిస్థితులను మదింపు చేశాయి. మున్ముందు ఏం చేయాలన్నదానిపై చర్చించాయి. అన్నీ అధికారికంగా కుదిరిన తర్వాతే మూడు ప్రభుత్వరంగ సంస్థలకు రూ.150 కోట్ల నిధులు ఇచ్చాం. దీని వెనుక దీర్ఘకాలిక ఆలోచన, సన్నద్ధత, కష్టం, శ్రమ ఉంది" అని పేర్కొన్నారు.
ఇతర ప్రైవేటు సంస్థలనూ..
కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఎక్కడెక్కడ తయారవుతాయన్నదానిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని, దానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత వెల్లడిస్తామని పాల్ చెప్పారు. ఇతర ప్రైవేటు సంస్థలను కూడా ఇందులోకి తీసుకురావాలనుకుంటున్నామని చెప్పారు. 'సజీవ వైరస్‌ను నిర్వీర్యం చేసే ఈ ప్రక్రియ అత్యాధునిక బీఎస్‌ఎల్3 లేబొరేటరీల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అప్పుడే వైరస్ బయటికి రాకుండా, శాస్త్రవేత్తలకు సోకకుండా ఉంటుంది. ఈ సౌకర్యాలు ఇప్పటికిప్పుడు తయారుచేయడం సాధ్యంకాదు. అందువల్ల ఇప్పటికే అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు ఓకే చెప్పి, ఎక్కడ ప్రభుత్వ కర్మాగారాలుంటే అక్కడ ఉత్పత్తిచేసే సాంకేతికత కాదిది' అని ఆయన వివరించారు.
ఇదీ చూడండి: 'జులై నాటికి 51.6 కోట్ల టీకా డోసుల పంపిణీ'