భాజపా, ప్రతిపక్షాలు రాష్ట్రపతి అభ్యర్థులను ప్రకటించగా స్వతంత్రులు సైతం దేశ ప్రథమ పౌరుడి పదవి కోసం పోటీ పడుతున్నారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన వినోద్ యాదవ్ అనే వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు ఎడ్లబండి మీద దిల్లీకి బయల్దేరారు. శివుని వేషదారణలో ఉన్న వ్యక్తిని వెంటబెట్టుకుని దిల్లీకి ఆయన పయనమయ్యారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచేందుకు తనకు తగిన మద్దతు ఉందని అంటున్నారు వినోద్ యాదవ్. జూన్ 25న నామినేషన్ వేస్తానని చెబుతున్నారు. గతంలోనూ వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ రాష్ట్ర మంత్రి రవీంద్ర జైశ్వాల్‌పై పోటీ చేశానని వినోద్ యాదవ్ తెలిపారు. వినోద్ యాదవ్ ఇప్పటివరకు తొమ్మిది ఎన్నికల్లో పోటీచేశారు. తాజాగా రాష్ట్రపతి ఎన్నికలకు పోటీ చేయబోతున్నారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ వినోద్ యాదవ్ ఓటమిపాలయ్యారు.
"శివుడు కలలోకి వచ్చి నరేంద్ర మోదీని ప్రధానిని చేసేందుకు గుజరాత్ నుంచి దిల్లీ పంపా. అలాగే నువ్వు కూడా యూపీ నుంచి దిల్లీ వెళ్లు. కచ్చితంగా రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుస్తానని శివుడు కలలో చెప్పాడు. చాలా రాష్ట్రాల ఎంపీల మద్దతు నాకు ఉంది. ఈ నెల 25 నామినేషన్ వేసిన తర్వాత ప్రధాని మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను కలిసి మద్దతు కోరతా."
-వినోద్ యాదవ్
ఇవీ చదవండి: 'గిరిజనుల కోసం ముర్ము కన్నా ఎక్కువే చేశా'
మోదీతో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము భేటీ.. శుక్రవారమే నామినేషన్