Vinayaka Chavithi 2023 Pooja Vidhanam Telugu : విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. భారతీయ సమాజంలో వినాయక చతుర్థికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది. ఆది దంపతుల(శివ, పార్వతులు) మొదటి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు. గణేశుడి కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల నమ్మకం.
Ganesh Chaturthi 2023 : జ్యోతిషశాస్త్రం ప్రకారం విఘ్నేశ్వరుడి ఆరాధనలో బుధుడు, కుజుడు, కేతు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుంది. విఘ్నేశ్వరుడు ధూమకేతు గణాధ్యక్షుడు, మోక్ష కారకత్వానికి అధినాయకుడు కావడంతో కేతు గ్రహానికి అధిపతి అయ్యాడని, బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞానప్రాప్తి, వ్యాపారాభివృద్ధి కలుగుతుందని, అలాగే, కుజ గ్రహం అనుగ్రహం వివాహ, అన్యోన్య దాంపత్యానికి చిహ్నం. ఒక్క పార్వతీ తనయుడిని ఆరాధించడం వల్ల ఈ మూడు గ్రహాల అనుగ్రహం పొందవచ్చని పేర్కొంటోంది.
Vinayaka Chavithi 2023 Sep 18th or 19th?: వినాయక చవితి ఎప్పుడు..? 18నా..? 19వ తేదీనా..?
వినాయకుడిని ఎందుకు ఆరాధించాలి? : విఘ్నేశ్వరుడంటేనే విఘ్నములను తొలగించువాడు అని అర్థం. విఘ్నాలు తొలగాలన్నా, ఆటంకాల నుంచి రక్షణ పొందాలన్నా, దృష్టి దోషములు పోవాలన్నా, విద్య, బుద్ధి, సిద్ధి ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారాభివృద్ధికి, మోక్ష ప్రాప్తికి విఘ్నేశ్వరుడి ఆరాధన కచ్చితంగా చేయాలని పురాణాలు చెబుతున్నాయి.
పూజకు కావాల్సిన సామాగ్రి : పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తులు, 21 రకాల పత్రి, ఉద్దరిణ, నైవేద్యాలు.
పూజ ఎలా చేసుకోవాలి? : ప్రతి ఒక్కరూ వినాయకచవితిని కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి. ఆ పర్వదినాన తెల్లవారు జామునే లేచి ఇంటిని, పూజగదిని శుభ్రపరిచి తలస్నానమాచరించాలి. కొత్త బట్టలు ధరించి ఇంటిని, పూజా మందిరాన్ని పసుపు, కుంకుమ, తోరణాలతో అలంకరించాలి. విఘ్నేశ్వరుడిని పెద్దలందరితో కుటుంబమంతా కలిసి కూర్చొని పూజామందిరంలోగానీ, తూర్పు, ఉత్తరం, ఈశాన్య భాగాలలో విగ్రహాన్ని ఉంచాలి. ఓ పళ్లెంలో బియ్యంవేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరువత్తులు వెలిగించి, దీపారాధన తర్వాత ఈ కింది మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ పూజను ప్రారంభించాలి.
శ్లోకం: ‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి.. సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మంగళా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం’ అని చదువుకోవాలి.
పీటపై వినాయక ప్రతిమను ఉంచి, పాలవెల్లికి పసుపు రాసి, కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపై వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు, పళ్లతో అలంకరించాలి. ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లెడుకాయలు మొదలైన పిండివంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి, అందులో నీళ్లువేసి, పైన కొబ్బరికాయ, రవిక ఉంచి కలశం ఏర్పాటు చేయాలి.
Ganesh Chaturthi 2023 : చవితి వేడుకల్లో చిన్నారులకూ భాగం కల్పించండిలా..
పూజా విధానం.. ఓం కేశవాయ స్వాహాః, ఓం నారాయణాయ స్వాహాః, ఓం మాధవాయ స్వాహాః అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి.
గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
ఈ కింది మంత్రాన్ని చెబుతూ కుడి చేతితో అక్షంతలు దేవునిపై చల్లాలి..
ఓం శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, ఓం శచీపురందరాభ్యాం నమః, ఓం అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః, ఓం శ్రీ సితారామాభ్యాం నమః, నమస్సర్వేభ్యోం మహాజనేభ్యః అయం ముహూర్త స్సుముహూర్తోస్తు
భూతోచ్చాటన : ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి భారకా: ఏతాషామవిరోధేనబ్రహ్మకర్మ సమారభే మంత్రాన్ని చదువుతూ అక్షతలు తలపై నుంచి వెనుక వేసుకొవాలి.
ప్రాణాయామం : ఓం భూః, ఓం భువః, ఓగ్ సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓగ్ సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్|, |ఓమా పోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోమ్ అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగతోపినా యః స్మరేద్వై విరూపాక్షంస బాహ్యాభ్యంతరశ్శుచిః అని నాలుగు దిక్కులా ఉద్ధరనితో నీళ్లు చల్లి శుద్ధిచేయాలి.
ఆ తర్వాత షోడశోపచార పూజ చేయాలి. అనంతరం పుష్పాలతో పూజిస్తూ అథాంగ పూజ నిర్వహించాలి. 21 రకాల పత్రాలతో ఏకవింశతి పత్ర పూజ చేయాలి. ఆ తర్వాత శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి జపించాలి. అథ దూర్వాయుగ్మ పూజ చేస్తూ నమస్కారం చేయాలి. పూజ పూర్తయ్యాక గణపతి వ్రత కథను వినాలి లేదా చెప్పుకోవాలి. వినాయక చవితి పద్యాలు చదవాలి. అనంతరం మంగళహారతి పట్టుకొని దీపాన్ని గణపతికి చూపిస్తూ మంగళాచరణాలు ఆలపించాలి. చివరగా గణపతి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసి, సాష్ఠాంగ నమస్కారం చేయాలి.
వినాయక పూజకు వాడే పత్రిలో దాగి ఉన్న రహస్యమేంటి? : భాద్రపదమాసం వర్షరుతువులో వస్తుంది. ఈ మాసంలో జబ్బులు అధికంగా వ్యాప్తి చెందుతాయి. అలాంటి ఈ మాసంలో వినాయకవ్రతాన్ని11 రోజులు లేదా 21 రోజుల పాటు చేస్తుంటారు. ఈ వ్రతం సందర్భంగా ప్రతి ఇంటినీ శుభ్రం చేసుకొని పసుపు, కుంకుమతో గడపలను అలంకరించుకొని మామిడి తోరణాలు కట్టుకోవడం వల్ల వాతావరణం శుభ్రపడుతుందని విశ్వసిస్తారు. అలాగే వినాయక పూజలో 21 రకాల పత్రాలు వాడతారు. ఈ పత్రాలు ఆయుర్వేద, ఔషధ గుణాలతో ఉంటాయి. వీటిని కలిపి వినాయకుడిని పూజించడం వల్ల ఆ పత్రాల నుంచి వచ్చే వాసనకు క్రిమికీటకాలు ఇళ్లలోకి ప్రవేశించవని, ఆ గాలి వాసనకు అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.
Lord Ganesh History బొజ్జగణపయ్యకు 'గణపతి' అనే పేరు ఎందుకొచ్చిందో తెలుసా..?
నిమజ్జనం ఎప్పుడు? ఎలా చేయాలి? : వినాయకుడిని 3, 5, 7, 9, 11, 21 రోజుల్లో నిమజ్జనం చేయడం ఉత్తమం. విఘ్నేశ్వరుడి పూజ కనీసం మూడు రోజుల పాటు చేయాలి. మట్టి వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేయాలి. పత్రి, ఫలాలు నిమజ్జనం చేయొద్దు. ఫలాలను దానం చేయడం ఉత్తమం. నిమజ్జనోత్సవం నదులు, సముద్రాల్లో చేయాలి. అలా కుదరని పక్షంలో కుండలో గానీ, బిందెలో గానీ నీళ్లలో నిమజ్జనం చేసి ఆ నీటిని తులసి, మామిడి వంటి మొక్కల్లో పోయాలి. విఘ్నేశ్వరుడి నిమజ్జనంలో దాగి ఉన్న రహస్యమేమిటంటే.. మట్టిలోంచి వచ్చిన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి.. దాన్ని శుద్ధిచేసి మంత్రాల ద్వారా దైవత్వాన్ని స్థాపన చేసి ధూపదీపాలతో, సుగంధ ద్రవ్యాలతో ఆహ్వానం పలుకుతాం. అష్టోత్తర శతనామాలతో పూజించి.. నైవేద్యాలు సమర్పించి ఉద్వాసన పలికి ఆఖరిగా విఘ్నేశ్వరుడిని నిమజ్జనం చేస్తూ తిరిగి మట్టిలోనే కలుపుతాం. ఇదే విధంగా మనిషి కూడా తన జీవితంలో ఈ శరీరం మట్టిలోంచే వచ్చింది.. తిరిగి అదే మట్టిలో కలుస్తుందని భావించి తన జీవిత ప్రయాణంలో శరీరంలో దాగి ఉన్న అరిషడ్వర్గాలను తొలగించుకొని భక్తిమార్గాన్ని పెంచుకొని ధర్మమార్గంలో నడుస్తూ ఆధ్యాత్మికచింతనను అలవర్చుకొని మోక్షం వైపు అడుగులు వేసి ముక్తిని పొందాలనే సారాంశం వినాయక వ్రతంలో స్పష్టంగా కనబడుతుంది.
వినాయకుడి ముఖ్యమైన రూపాలెన్ని? : విఘ్నేశ్వరుడికి మొత్తం 32 రూపాలు ఉన్నాయి. వీటిలో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనవిగా తాంత్రికులు పూజిస్తారని చెబుతారు. అందువల్ల ఈ 16 రూపాలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
1. బాలగణపతి 2. తరుణ గణపతి 3. భక్త గణపతి 4. వీర గణపతి 5. శక్తిగణపతి 6. ద్విజ గణపతి 7. సిద్ధి గణపతి 8. ఉచ్ఛిష్ట గణపతి 9. విష్ణు గణపతి 10.క్షిప్త గణపతి, 11. హేరంభ గణపతి 12. లక్ష్మీగణపతి 13. మహాగణపతి 14. విజయ గణపతి 15. రుత్య గణపతి 16. ఊర్ధ్వ గణపతి
Vinayaka Chaturthi: రకరకాల ఆకృతుల్లో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు
Ganesh chaturthi 2022 మోదక ప్రియా.. ప్రమోద క్రియా
Lord Ganesh in Woman form స్త్రీ రూపంలో దర్శనమిచ్చే గణపయ్య ఎక్కడంటే..?