కాసేపు కరెంట్ లేకపోతేనే మనం ఇబ్బంది పడిపోతాం. ఇంకా ఎప్పుడు వస్తుందబ్బా అంటూ చిరాకు పడతూ వేచి చూస్తాం. అలా విద్యుత్ లేకుండా జీవించలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ గ్రామస్థులు మాత్రం గత ఆరు దశాబ్దాలుగా విద్యుత్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎన్నో పోరాటాలు చేసి ఇప్పటికి సాధించుకున్నారు. ఆ గ్రామం సంగతెంటో మీరూ తెలుసుకోండి.
కర్ణాటక శివమొగ్గకు 20 కిలోమీటర్ల దూరంలో ఉందీ గ్రామం. ఈ గ్రామానికి గత ఆరు దశాబ్దాలుగా విద్యుత్ లేదు. విద్యుత్ ఉత్పత్తి కోసమే భూములు ఇచ్చినా వారికి మాత్రం ఆ సదుపాయం దక్కలేదు. కర్ణాటక విద్యుత్ అవసరాల కోసం 1964లో శరావతి నదిపై లింగనమక్కి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. ఇందుకోసం డ్యామ్ సమీపంలోని శెట్టిహళ్లి, చిత్రుశెట్టిహళ్లి గ్రామాలను ఖాళీ చేయించి వేరే చోటుకు తరలించింది. కొందరు గ్రామస్థులు మాత్రం శెట్టిహళ్లి అటవీ ప్రాంతంలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరికి కూడా వారు కోల్పోయిన భూమికి సమానంగా భూమిని, పరిహారం ఇస్తామని చెప్పారు అధికారులు.
అధికారుల మాటలు నమ్మి అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గ్రామస్థుల జీవితం దుర్భరంగా మారిపోయింది. ప్రజలు నివసించడానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. గ్రామస్థులంతా పోరాటం చేయడం వల్ల 1984లో విద్యుత్ సదుపాయం కల్పించేందుకు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందుకోసం సర్వే చేపట్టగా.. అటవీ శాఖ అభ్యంతరం తెలిపింది. ఆరు దశాబ్దాల పోరాటం అనంతరం.. జంతువులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భూగర్భ కేబుళ్లు వేయాలని ఆదేశించింది కర్ణాటక హైకోర్టు. ఫలితంగా రూ. 3.60 కోట్ల నిధులతో 11.5 కిలోమీటర్ల పొడవు గల భూగర్భ కేబుల్ వ్యవస్థ పనులు చేపట్టారు అధికారులు.
"ఈ డ్యామ్ నిర్మాణ సమయంలో మమ్మల్ని చెత్తలాగా లారీలో తీసుకుని వచ్చారు. అప్పుడు మేము చిన్నపిల్లలం. ఆనాటి నుంచి ఇప్పటివరకు కరెంట్ లేకుండా అంధకారంలోనే బతికాం. మౌలిక సదుపాయాల కోసం చాలా ఏళ్లు పోరాటం చేశాం. ఇప్పుడు మా ఊరికి విద్యుత్ రాబోతుంది. మాకు మనవళ్లు వచ్చాక విద్యుత్‌ను చూడబోతున్నాం."
-హలప్ప, గ్రామస్థుడు
ఇవీ చదవండి: రంగోలీతో అతి చిన్న సాయిబాబా చిత్రం వేసిన టీచర్ ప్రపంచ రికార్డు దాసోహం
కొడుకు పెళ్లిలో రిటైర్డ్ టీచర్ ఉదారత.. స్టూడెంట్స్‌కు గిఫ్ట్‌గా రూ.10 వేల చెక్కులు..