RTI Activist Murder: మధ్యప్రదేశ్‌లోని విదిశాలో దారుణం జరిగింది. నగరంలో ప్రభుత్వ కార్యాలయాలకు సమీపంలోనే ఓ ఆర్టీఐ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం సాయంత్రం కాల్చి చంపారు. విషయం తెలుసుకున్న పోలీసులు..కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడ్ని ముఖర్జీనగర్ నివాసి అయిన రంజిత్ సోనీగా గుర్తించారు.
" ఒకప్పుడు ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేసిన రంజిత్ సోనీ.. ప్రస్తుతం ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగిస్తూ సమాచారం సేకరిస్తుంటారు. ఈ ఘటనకు వ్యక్తిగత కక్షలే కారణమని తెలుస్తోంది. దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు ప్రారంభించారు. పోస్టుమార్టం నిమిత్తం బాధితుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. బాధితుడి బ్యాగు నుంచి కొన్ని పేపర్లు కూడా స్వాధీనం చేసుకున్నాం"
-- సమీర్ యాదవ్, అదనపు ఎస్పీ
నగరంలోని నిత్యం రద్దీగా ఉండే ప్రభుత్వ కార్యాలయాల ముందు హత్య జరగడం వల్ల ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ప్రజలు వెంటనే ఘటనాస్థలికి పెద్ద ఎత్తున చేరుకుని గుమిగూడారు.
ఇవీ చదవండి: భర్తను వదిలి 22 రోజులు సహజీవనం.. ఆపై బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్య
చెట్టును ఢీకొని కాలిపోయిన కారు.. డ్రైవర్ సజీవదహనం.. లోపల మరికొందరు?