బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎందరో వారసులు బరిలో దిగారు. తమ తండ్రుల నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వీరంతా పట్టు సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో దిగ్గజ నేతలు మొదలుకొని గతంలో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకుల వారసులూ ఉన్నారు. మరి విజయం ఎవరిని వరించిందంటే...?
ఆర్జేడీ:
- మహాకూటమి సీఎం అభ్యర్థి, లాలూ చిన్న కుమారుడు తేజస్వీ యాదవ్ రాఘోపుర్‌లో విజయఢంకా మోగించారు. భాజపా అభ్యర్థి సతీశ్ కుమార్‌పై 38 వేలఓట్లకుపైగా మెజార్టీ సాధించారు.
- మహువా సిట్టింగ్ ఎమ్మెల్యే, తేజస్వీ అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ హసన్‌పుర్ నుంచి గెలుపొందారు.
- పార్టీ ఉపాధ్యక్షుడు శివానంద్ తివారీ కుమారుడు రాహుల్ తివారీ(షాపుర్)- గెలుపు
- పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు జగదానంద్ సింగ్ తనయుడు సుధాకర్ సింగ్(రాంగఢ్)- గెలుపు
- కేంద్ర మాజీ మంత్రి కాంతి సింగ్ కుమారుడు రుషీ సింగ్(ఓబ్రా)- గెలుపు
భాజపా:
- కేంద్ర మాజీ మంత్రి జయప్రకాశ్ నారాయణ్ యాదవ్ సోదరుడు విజయ్ప్రకాశ్పై పోటీ చేసిన ప్రముఖ కామన్వెల్త్ క్రీడాకారిణి శ్రేయసి సింగ్(జముయీ) విజయం సాధించారు. ఈమె కేంద్ర మాజీ మంత్రి, దివంగత దిగ్విజయ్ సింగ్ కుమార్తె.
- మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కుమారుడు నితిన్ నవీన్(బంకీపోరె) గెలిచారు.
జేడీయూ:
- రాష్ట్ర మాజీ మంత్రి, దివంగత కపిల్‌దేవ్ కామత్ కోడలు మీనా కామత్(బాబూబర్హీ) నుంచి గెలిచారు.
- హరియాణా గవర్నర్ సత్య నారాయణ్ ఆర్య కుమారుడు కౌశల్ కిశోర్(రాజ్‌గిర్) సత్తా చాటారు.
కాంగ్రెస్:
- శతృఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా(బంకీపోరె) పరాజయం చెందారు.
జేడీయూ నేత వినోద్ చౌధరీ కూతురు పుష్పమ్ ప్రియా చౌధరీ(బంకిపోరె).. ప్లూరల్స్ పార్టీని స్థాపించి బిహార్ రాజకీయ క్షేత్రంలోకి అడుగుపెట్టారు. బిహార్‌లో భారీ మార్పులు రావాలంటూ గళమెత్తి.. సీఎం నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసినా గెలవలేకపోయారు. ఇక్కడ భాజపా అభ్యర్థి(నవీన్) గెలిచారు.