దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ చాలా ఆస్పత్రులను ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. పలుచోట్ల ఆక్సిజన్‌ను నల్లబజారులో విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు రహదారుల మంత్రిత్వశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సరఫరా చేసే అన్ని రకాల వాహనాలను జీపీఎస్‌తో ట్రాకింగ్ చేయాలని నిర్ణయించింది. అన్ని వాహనాలకు వీఎల్‌టీ పరికరాన్ని అమర్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.
![GPS tracking oxygen containers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11639342_ghb.png)
'ఆక్సిజన్ కంటైనర్లు/ట్యాంకర్లు/వాహనాలకు తప్పనిసరిగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్(వీఎల్‌టీ) పరికరాన్ని అమర్చడం తప్పనిసరి' అని రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. సరఫరాలో ఆలస్యం, దారిమళ్లించడం వంటి వాటిని నిరోధించడంతో పాటు ట్యాంకర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఈ జీపీఎస్ ట్రాకింగ్ వినియోగించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది.
ఇక దేశవ్యాప్తంగా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న పలు రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సమయంలో ఇప్పటికే దేశీయంగా, అంతర్జాతీయంగా ఆక్సిజన్ జనరేటర్లు, కంటైనర్లు, సిలిండర్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో యుద్ధవిమానాల ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు ట్యాంకర్లు/వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇదీ చూడండి: 'నందిగ్రామ్ రిటర్నింగ్ అధికారికి పూర్తి భద్రత'