Uttarakhand results 2022: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్ కాంగ్రెస్‌లో దిగ్గత నేత. 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తలపండిన నాయకుడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా, ఐదు సార్లు ఎంపీగా గెలిచిన అనుభవం ఆయన సొంతం. కేంద్రమంత్రిగానూ సేవలందించారు. ఇంతటి ఘన చరిత్ర ఉన్న రావత్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూశారు. ఉత్తరాఖండ్ లాల్కువా నుంచి పోటీ చేసి భాజపా అభ్యర్థి మోహన్ భిష్ఠ్ చేతిలో 14వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. సొంత రాష్ట్రంలోనే కాదు పంజాబ్‌లోనూ కాంగ్రెస్ ఓటమికి ఆయనే కారణమనే అపవాదు మూటుగట్టుకునే పరిస్థితి తెచ్చుకున్నారు.
తాను ఓడటమే గాక కాంగ్రెస్‌నూ..
అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు పంజాబ్ కాంగ్రెస్‌లో తీవ్ర సంక్షోభం తలెత్తింది. సీఎం అమరీందర్ సింగ్, పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్‌కు మధ్య విభేదాలు తారస్థాయికి చేరి సొంత పార్టీ నేతలే బహిరంగ విమర్శలు గుప్పించారు. అమరీందర్‌పై సిద్ధూ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను సీనియర్ నేత అయిన హరీశ్ రావత్‌కు అప్పగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. 2017 నుంచి అసోం, పంజాబ్ రాష్ట్రాల కాంగ్రెస్ ఇంఛార్జ్‌గా ఉన్న ఆయన రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించలేకపోయారు. పైగా అమరీందర్ సింగ్‌కు రావత్‌కు అసలు పడదనే ప్రచారం కూడా ఉంది. దీంతో సంక్షోభం మరింత ముదిరి అమరీందర్ సీఎం పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌కు పెద్ద షాక్ ఇచ్చారు. ఆ తర్వాత పంజాబ్‌లో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు వర్గానికి చెందిన చరణ్‌జీత్ సింగ్ చన్నీని నియమించింది అధిష్ఠానం. అయినప్పటికీ కాంగ్రెస్‌లో వర్గపోరు నడిచింది. ఈ అవకాశాన్ని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ అందిపుచ్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో బరిలోకి దిగి చరిత్ర సృష్టించింది. పంజాబ్‌లో తొలిసారి శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ కాకుండా మరో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆప్ 90 స్థానాలకు పైగా గెలవగా.. హస్తం పార్టీ కేవలం 15 స్థానాలకే పరిమితమై చేజేతులా పీఠాన్ని కోల్పోయింది.
Uttarakhand election 2022
ఉత్తరాఖండ్‌లోనూ..
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పంజాబ్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు రావత్. పూర్తిగా ఆయన సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా రావత్ పేరును కాంగ్రెస్ ప్రకటించలేదు. దీంతో ఆయన పార్టీకి ఝలక్ ఇచ్చినంత పని చేశారు. ఒకానొక సమయంలో రావత్ పార్టీ మారతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి. దీంతో అధిష్ఠానం ఆయనను బుజ్జగించింది. సీఎం అభ్యర్థి తానే అనే హామీ పొందిన తర్వాత ఎన్నికల ప్రచారంలో రావత్ చురుగ్గా పాల్గొన్నారు.
అయితే రావత్ 2017 నుంచి ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. అప్పుడు పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ నైనితాల్-ఉధంసింగ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి భాజపా అభ్యర్థి అజయ్ భట్ చేతిలో 3,39,096 భారీ ఓట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో తొలుత సొంత ప్రాంతం రామ్‌నగర్ నుంచి పోటీ చేయాలనుకున్నారు రావత్. అయితే అక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బరిలో ఉన్నందున రావత్‌కు లాల్కువా సీటు కేటాయించింది అధిష్ఠానం. అక్కడ అప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థిని కాదని ఆయనకు అవకాశం ఇచ్చింది. కానీ రావత్‌కు ఈసారి కూడా భంగపాటే ఎదురయ్యింది. ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో మోస్ట్ పాపులర్ సీఎంగా రావత్ పేరే ఉండటం గమనార్హం. కానీ ఫలితాలు మాత్రం తారుమారయ్యాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చినప్పటికీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. భాజపా దాదాపు 48 స్థానాలు గెవవగా.. కాంగ్రెస్ 18 సీట్లకే పరిమితమైంది. ఉత్తరాఖండ్లో ఒక పార్టీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం 21 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
Uttarakhand Assembly Poll results
ఫలితాలపై రావత్ ఏమన్నారంటే?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రావత్ స్పందించారు. ఉత్తరాఖండ్ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు అవసరమైన మేర తాము ప్రయత్నించలేకపోయామన్నారు.
" ప్రజల తీర్పు మార్పు కోరేలా ఉంటుందని మేం అనుకున్నాం. కానీ మేం వారికి అనుకున్నంత స్థాయిలో చేరువకాలేకపోయాం. ప్రజాతీర్పును శిరసావహిస్తాం. మా ప్రచార వ్యూహం సమర్థంగా లేదు. ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నేను దీన్ని అంగీకరిస్తున్నా. కార్యకర్తలు బాగా పనిచేశారు. వారికి ధన్యవాదాలు. నేను ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయా.. కానీ నా కూతురు సహా ఎన్నికల్లో గెలిచిన అందరికీ శుభాకాంక్షలు. నా వరకైతే ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నాయి. ఇంత భారీ ద్రవ్యోల్బణం తర్వాత కూడా ఇదే ప్రజల తీర్పు అయితే, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయానికి నిర్వచనం ఏంటి? దీని తర్వాత ప్రజలు 'భాజపా జిందాబాద్' అని మాట్లాడటం నాకు అర్థం కాట్లేదు.
-హరీశ్ రావత్, కాంగ్రెస్ సీనియర్ నేత.
ఇవీ చదవండి: