Husband Jumps Into Wife's Pyre: భార్య చితిలోనే దూకి ఆత్మహత్యకు యత్నించాడు ఓ భర్త. ఉత్తర్ప్రదేశ్ మహోబా జిల్లా జైత్‌పుర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. వెంటనే స్పందించిన స్థానికులు.. అతడిని రక్షించారు. కాలిన గాయాలతో ఉన్న అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడి భార్య ఆత్మహత్య చేసుకోవడం వల్ల మనస్తాపానికి గురయ్యాడని పోలీసులు వెల్లడించారు.
ఇదీ జరిగింది: మహోబా జిల్లా కుల్పహాడ్ కొత్వాలి పరిధి జైత్పుర్లో బ్రిజేష్, ఉమ నివసిస్తున్నారు. చికిత్స నిమిత్తం రూ.5,000 కావాలని భర్త బ్రిజేష్ను అడిగింది ఉమ. తర్వాతి రోజు ఇస్తానని భర్త చెప్పిన సమాధానంతో కలత చెందిన ఆమె అత్మహత్య చేసుకుంది. ఉదయం లేచి చూసేసరికి ఉమ ఉరివేసుకుని కనిపించింది. వెెంటనే ఉమను.. జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని జైత్‌పుర్ పట్టణంలోని దియోధి శ్మశానవాటికకు అంత్యక్రియల కోసం తీసుకెళ్లారు. మనస్తాపానికి గురైన భర్త బ్రిజేష్.. మండుతున్న భార్య చితిలోకి దూకాడు. దీంతో అక్కడున్న వ్యక్తులు అతడిని పట్టుకుని బయటకు తీశారు. కాగా, కట్నం కోసం భర్త, అత్తమామలే తమ కూతుర్ని హత్య చేశారని ఉమ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తన భార్య చిన్న కారణానికే ఆత్మహత్యకు పాల్పడిందని.. ఆమె చనిపోయాక తనకు బతకాలని లేదని బ్రిజేష్ చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఏడాదిన్నర చిన్నారిపై అత్యాచారం.. సొంత మేనమామనే!