UPSC topper Shruti Sharma tips: సివిల్స్ 2021 ర్యాంకుల్లో ప్రథమ స్థానంలో నిలవడం పట్ల టాపర్ శ్రుతి శర్మ హర్షం వ్యక్తం చేశారు. సివిల్స్‌కు అర్హత సాధిస్తానన్న విశ్వాసం ఉన్నప్పటికీ.. టాపర్‌గా నిలవడం ఆశ్చర్యంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. ఎంతో కష్టంతో కూడుకున్న ఈ ప్రయాణంలో తన తల్లిదండ్రులతో పాటు స్నేహితులు కూడా పూర్తిగా తనకు సహకరించారని చెప్పారు. పోస్టింగ్‌లో తాను ఐఏఎస్ ఎంచుకోవాలని అనుకుంటున్నట్లు దిల్లీకి చెందిన శ్రుతి శర్మ తెలిపారు.
"ఇలాంటి ఫలితాన్ని నేను ఊహించలేదు. టాపర్‌గా నిలవడం ఎంతో సర్‌ప్రైజింగ్‌గా ఉంది. నా ప్రయాణంలో సహకరించిన ప్రతిఒక్కరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా నా తల్లిదండ్రులకు. నాకు పూర్తి మద్దతుగా నిలిచారు. కొందరు స్నేహితులు నన్ను గైడ్ చేశారు" అని శ్రుతి వర్మ చెప్పారు.
శ్రుతి శర్మ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల (దిల్లీ వర్సిటీ)లో హిస్టరీ (ఆనర్స్)లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో సీటు సాధించి అక్కడే పీజీ అభ్యసించారు. సివిల్స్ పరీక్ష కోసం సన్నద్ధమయ్యేందుకు జామియా మిల్లియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో చేరిన శ్రుతి.. హిస్టరీని తన ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. నాలుగేళ్ల పాటు సివిల్స్ కోసం కఠోర శ్రమ, ఎంతో ఆత్మవిశ్వాసంతో చదివి టాపర్‌గా నిలిచి అద్భుతం సృష్టించారు.
UPSC toppers interview: రెండో ర్యాంకు సాధించిన కోల్‌కతాకు చెందిన అంకిత అగర్వాల్.. దిల్లీ యూనివర్సిటీ నుంచి ఎకనమిక్స్ (ఆనర్స్)లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆమె ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. సివిల్స్ తొలి ప్రయత్నంలో ఐఆఎస్కు ఎంపికైన అంకిత.. ప్రస్తుతం ఐఏఎస్ పోస్టును ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారు. మహిళా సాధికారత దిశగా పనిచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. తాను ఇన్ని గంటలే చదవాలని నియమం పెట్టుకోలేదని తెలిపారు. "పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు ఇన్ని గంటలు చదవాలని అనుకోలేదు. వీలైనంత సమయం సన్నద్ధతకే వెచ్చించాను. స్థిరమైన టైమ్‌టేబుల్ పాటించేదాన్ని" అని వివరించారు.
Gamini singla UPSC preparation: చండీగఢ్‌కు చెందిన గామిని సింగ్లా సివిల్స్‌లో మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసి.. సోషియాలజీని ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకొని సివిల్స్‌లో సత్తా నిరూపించుకున్నారు. మహిళలు ఏదైనా సాధించగలరని సివిల్ సర్వీస్ పరీక్ష-2021 ఫలితాలే రుజువు చేశాయని గామిని పేర్కొన్నారు. ఈ విజయంతో చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది తన కల నిజమైన రోజుగా పేర్కొన్నారు. తాను ఐఏఎస్ సర్వీసును ఎంచుకున్నాననీ.. దేశ అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పారు. పంజాబ్‌లోని ఆనంద్‌పూర్ సాహిబ్ ప్రాంతానికి చెందిన సింగ్లా.. ఓ వార్తా సంస్థ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడి తన స్పందనను, ఈ పరీక్ష కోసం తాను చేసిన సాధనకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. సివిల్స్ పరీక్షను రెండో ప్రయత్నంలో క్లియర్ చేసినట్టు చెప్పారు. ఈ విజయం సాధించడంలో క్రెడిట్ తన తండ్రికే దక్కుతుందనీ.. స్వీయ అధ్యయనమే ఎంతో ఉపయోగపడిందని చెప్పుకొచ్చారు.
సివిల్స్‌లో సత్తా చాటేందుకు రోజూ 9 నుంచి 10 గంటల పాటు చదివేదాన్నని సింగ్లా తెలిపారు. అలాగే, పటియాలాలో 'వినోద్ సర్' వద్ద కోచింగ్ తీసుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా స్వీయ అధ్యయనం చేసి చివరకు సాధించానన్నారు. ఈ పరీక్షకు ప్రిపేర్ కావడంలో తన తండ్రి కీలక పాత్ర పోషించారని చెప్పారు.
సింగ్లా తల్లిదండ్రులిద్దరూ హిమాచల్‌ప్రదేశ్‌లో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. అయితే, తొలి మూడు ర్యాంకుల్లో మహిళలే సత్తా చాటడంపై సింగ్లా స్పందిస్తూ.. మహిళలు తాము కష్టపడి, అంకితభావంతో ఏదైనా సాధించగలరని ఈ ఫలితాలే నిరూపించాయన్నారు. యూపీఎస్‌సీ మూడో ర్యాంక్‌తో సత్తా చాటిన గామిని సింగ్లా.. కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేసి.. యూపీఎస్‌సీలో ఆప్షనల్ సబ్జెక్టుగా సోషియాలజీని ఎంచుకున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: