వారణాసిలోని గ్యాన్వాపి మసీదు ముందరి 1700 చదరపు అడుగుల స్థలాన్ని కాశీ విశ్వనాథ కారిడార్ ఆలయ అధికారులకు అందించారు అక్కడి ముస్లింలు. దానికి బదులుగా ఆలయం నిర్వాహకులు మరో ప్రాంతంలో 1000 చదరపు అడుగుల స్థలాన్ని ముస్లింలకు ఇచ్చారు. అయితే.. ఆ ప్రాంతంపై సుదీర్ఘకాలంగా సాగుతోన్న వివాదానికి ముస్లింలు ఇచ్చిన స్థలానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
గ్యాన్వాపి మసీదుకు ఎదురుగానే ఆ స్థలం ఉండటం వల్ల ఆలయానికి ఇవ్వటం అంత సులభమేమీ కాలేదని ముస్లిం మత పెద్దలు తెలిపారు. స్థలం ఇవ్వాలని ఆలయ నిర్వాహకులు అడిగిన క్రమంలో అందరితో సంప్రదించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. ఆ స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ జులై 8నే ముగిసింది.
ప్రస్తుతం ముస్లింలు అందించిన స్థలంలోనే ఆలయానికి చెందిన తాత్కాలిక కంట్రోల్ రూమ్ 1993లో నిర్మించారు. అయితే.. ఆ స్థలంపై పూర్తి హక్కులు ఇప్పుడే లభించినట్లయింది. ఈ విషయంపై కీలక విషయాలు వెల్లడించారు అంజుమ్ ఇంతెజామియా మసీదు సంయుక్త కార్యదర్శి ఎస్ఎం యాసిన్.
"ఈ స్థలాన్ని కంట్రోల్ రూం కోసం గతంలోనే సున్నీ వక్ఫ్‌బోర్డ్ ఇచ్చింది. ప్రస్తుతం కాశీ విశ్వనాథ్ కారిడార్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో దారి కోసం ఆ స్థలం అవసరమైంది. అందరితో సంప్రదించి, అందరి అనుమతి తీసుకుని స్థలం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయం రెండు కమ్యూనిటీల మధ్య వారధిలా పనిచేస్తుందనే నమ్మకం ఉంది. శాంతి, సోదరభావ సందేశాన్ని అందిస్తుంది."
- ఎస్ఎం యాసిన్, అంజుమ్ ఇంతెజామియా మసీదు సంయుక్త కార్యదర్శి.
అయితే మసీదు స్థలంపై ఉన్న వివాదం మీద పలు కీలక విషయాలు వెల్లడించారు యాసిన్. 'మసీదు భూమిని ఎవరికి ఇవ్వబోము. ఆ విషయంలో కోర్టులో పోరాడుతున్నాం. మసీదు స్థలం మాదీ, దానిని ఇచ్చేది లేదు. ఇప్పుడు ఇచ్చిన స్థలం వేరు.' అని పేర్కొన్నారు.
వివాదం ఏమిటి?
కాశీ విశ్వనాథ్ ఆలయం, గ్యాన్వాపి మసీదు స్థల వివాదం సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం 2019, డిసెంబర్లో స్థానిక లాయర్ వీఎస్ రాస్తోగి.. వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొగల్ రాజు ఔరంగాజేబ్ 1664లో 2వేల ఏళ్ల నాటి కాశీ విశ్వనాథ్ ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చివేసి మసీదును నిర్మించాడని పిటిషనర్ పేర్కొన్నారు. భారత సర్వే విభాగం(ఏఎస్ఐ)తో మసీదు స్థలాన్ని మొత్తం సర్వే చేయాలని కోరారు. అయితే.. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అంజుమ్ ఇంతెజామియా మసీదు కమిటీ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ క్రమంలోనే ఈఏడాది ఏప్రిల్‌లో భారత సర్వే విభాగానికి అనుమతులు ఇచ్చింది వారణాసి కోర్టు. ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇదీ చూడండి: ఆయుధ లైసెన్సుల అక్రమాల కేసులో సీబీఐ సోదాలు
ఇదీ చూడండి: 'బుద్ధుని బోధనల శక్తిని ప్రపంచం గ్రహించింది'